
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ విచారణకు విశాఖపట్నం పోలీసులు సహకరించడం లేదు.
సాక్షి, విశాఖపట్నం: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణకు విశాఖపట్నం పోలీసులు సహకరించడం లేదు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే తప్ప ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు వివరాలు ఇవ్వలేమని ఎన్‌ఐఏకు విశాఖ అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం. విశాఖపట్నం విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు.. ఎన్‌ఐఏకు అప్పగింత)
ఈ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఈనెల 1వతేదీన ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేసింది. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) కె.లక్ష్మణ్ శుక్రవారం ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఎన్‌ఐఏ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో జగన్‌పై హత్యాయత్నం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన దర్యాప్తును నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో కేసు డాక్యుమెంట్లను, రికార్డులన్నింటినీ చట్ట నిబంధనల మేరకు ఎన్‌ఐఏకు అప్పగించాల్సి ఉంటుంది.
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును పక్కదారి పట్టించేలా అటు ముఖ్యమంత్రి, ఇటు డీజీపీ ఇద్దరూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశించాలంటూ వైస్సార్‌సీపీ ముందు నుంచి డిమాండ్ చేస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే ఎన్‌ఐఏ దర్యాప్తుకు ఏపీ పోలీసులు సహకరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.