‘అప్పుడేలా పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చారు?’ | YSRCP Leaders Reaction Over Attack On YS Jagan | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 25 2018 8:16 PM | Last Updated on Thu, Oct 25 2018 9:19 PM

YSRCP Leaders Reaction Over Attack On YS Jagan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై దాడి ప్రచారం కోసం జరిగిందని డీజీపీ చెప్పడం దారుణమని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగింది వాస్తవమా, కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఎక్కడైన అభిమాని ఇష్టమైన నాయకునిపై దాడి చేస్తాడా అని నిలదీశారు. డీజీపీ వ్యాఖ్యలు బాధ కలిగించాయని పేర్కొన్నారు. విచారణ చేయకుండానే డీజీపీ అలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఎవరి ఒత్తిడితో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. 

తొలుత డీజీపీ, ఆ తర్వాత మంత్రి నక్కా ఆనంద్‌బాబు, విశాఖ ఏసీపీలు విచారణ జరపకుండానే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం ప్రచారం కోసం జరిగిదంటూ మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. పలువురు ఏపీ మంత్రులు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్ట్‌ కేంద్రం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. వారు ఎందుకంత ఉలిక్కిపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఎయిర్‌పోర్ట్‌ కేంద్రం ఆధీనంలో ఉందని మాట్లాడుతున్నవారికి.. గతంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనడానికి విశాఖకు చేరుకున్న వైఎస్‌ జగన్‌ను పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్న సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు. డీజీపీ స్థాయి వ్యక్తే ఈ విధంగా మాట్లాడితే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నటుడు శివాజీ చెప్పినట్టుగా జరిగితే ముందు అతన్ని అరెస్ట్‌ చేసి విచారించాలని అన్నారు. కోడి పందాలలో వినియోగించే కత్తి చాలా పదునైనదని.. అది కొద్దిగా అటు ఇటు అయితే ప్రాణలే పోతాయని తెలిపారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ క్షేమంగా ఉన్నారని.. అభిమానులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్‌ బలమైన, ధైర్యం ఉన్న నాయకుడు
వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడు సెల్ఫీ పేరుతో వైఎస్‌ జగన్‌పై దాడికి ప్రయత్నించిన సమయంలో కత్తి మెడకు తగిలితే ఏమై ఉండేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్‌​ అడిగితే లేదని చెబుతున్నారని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో భద్రత ఉన్నా అలాంటి కత్తులు ఎలా తీసుకువచ్చారో అర్ధం కావడం లేదని అన్నారు. ఎయిర్‌పోర్ట్‌ లోపల జరిగిన ఘటనతో తమకు సంబంధం లేదని మంత్రులు చెప్పడాన్ని నీచమైన చర్యగా అభివర్ణించారు. ఈ సంఘటనను వైఎస్సార్‌​ సీపీ ఎక్కడ రాజకీయాలకు వాడాలనుకోలేదని స్పష్టం చేశారు. రాజకీయాలు పక్కనపెట్టి మనం మనుషులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటి నీచమైన రాజకీయాలు చోటుచేసుకోవడంపై మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ బలమైన, ధైర్యం ఉన్న నాయకుడు అందుకే ఇలాంటి వాటిని పట్టించుకోకుండా హైదరాబాద్‌ బయలుదేరి వచ్చారని తెలిపారు. క్యాంటీన్‌లో పనిచేసే వ్యక్తి ఇలా చేస్తే రేపు పాదయాత్రలో ఏం జరుగుతుందనే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్‌ జగన్‌కు భద్రత పెంచాలని కోరారు.

చంద్రబాబుపై దాడి జరిగితే వైఎస్సార్‌ నిరసన తెలిపారు
వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని తప్పుదారి పట్టించేలా ప్రభుత్వం వ్యవహారించడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబుపై ఇలాంటి దాడి జరిగితే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వెంటనే వెళ్లి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఓ సినీ నటుడు చెప్పినట్టు అంతా జరిగితే.. అతన్ని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మంత్రులు, టీడీపీ నేతలు ప్రెస్‌ మీట్లు పెట్టి రాజకీయ కోణంలో మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు.

చదవండి: 

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం: లైవ్‌ అప్‌డేట్స్‌

వైఎస్‌ జగన్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం; మోహన్‌బాబు స్పందన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement