సాక్షి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ చైర్మన్‌గా, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణాలు అన్వేషించేందుకు ఈ బృందం క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించింది. కరికాల వలవన్ నేతృత్వంలో బృంద సభ్యులు శనివారం పరిశ్రమని సందర్శించి అణువణువూ పరీక్షించారు. ప్లాంట్‌లోని ప్రతి ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలను నిశితంగా పరిశీలించారు.
ప్రమాదం సంభవించినప్పుడు ట్యాంకులో సుమారు రెండు వేల మెట్రిక్ టన్నుల స్టైరీన్ నిల్వ ఉంది. 40 రోజులుగా ట్యాంకులో నిల్వ ఉండటం, లోడ్, అన్‌లోడ్ చర్యలు లేకపోవడంతో ఆటో పాలిమరైజేషన్ స్థితికి చేరుకుంది. ఫలితంగా స్టైరీన్.. వాయువు రూపంలోకి మారిపోయింది. ట్యాంకులో ఒత్తిడి పెరిగితే వాల్వులు వాటికవే తెరుచుకుని అది బయటకు వెళుతుంటుంది. వాల్వ్ ఏమాత్రం తెరుచుకోకున్నా ట్యాంక్ పేలిపోయేదే. అదే జరిగితే పక్కనే ఉన్న మూడు వేల మెట్రిక్ టన్నుల ట్యాంక్ కూడా పేలిపోయేది. అదృష్టవశాత్తు ట్యాంక్‌కు ఉన్న వాల్వ్‌లు పనిచేస్తున్నట్టు కమిటీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. వాయు రూపంలో ట్యాంకు నుంచి స్టైరీన్ వెళ్లిపోవడంతో ప్రస్తుతం 1650 మెట్రిక్ టన్నులు మాత్రమే ట్యాంకులో ఉన్నట్టు నిపుణుల కమిటీ గుర్తించింది.
పరిస్థితి అదుపులోనే ఉంది
► ట్యాంకు ఉపరితల ఉష్ణోగ్రతలతో పాటు, లోపలి ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు సంభవించినా అది వాయు రూపంలోకి మారిపోతుంటుంది.
► ప్రెజర్ కుక్కర్‌లో ఆవిరి పెరిగినప్పుడు విజిల్ రూపంలో బయటికి వచ్చే మాదిరిగా... వాల్వ్ నుంచి వస్తుంటుంది.
► లోపలి ఉష్ణోగ్రతలు 150 డిగ్రీల వరకూ, బయటి ఉష్ణోగ్రతలు 110 డిగ్రీలకు చేరుకోవడంతో ట్యాంకులో ఒత్తిడి పెరిగింది.
► యాంటీ డాట్‌గా పీటీబీసీ పంపించడంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవడంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
► లోపలి ఉష్ణోగ్రతలు 76 డిగ్రీలకు చేరుకుంటే భద్రంగా ఉన్నట్టని నిపుణులు చెబుతున్నారు.
► ప్రస్తుత ఉష్ణోగ్రత 75 డిగ్రీలకు చేరుకున్నట్టు కమిటీ గుర్తించి పరిస్థితి అదుపులో ఉన్నట్టు తెలిపింది.
గాలిలో స్టైరీన్ శాతం తగ్గుముఖం
► గాలిలో స్టైరీన్ మోనోమర్ శాతం కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
► ప్రస్తుతం కంపెనీ పరిసరాల్లో 1.9 పీపీఎంగా నమోదవుతోంది.
► అయితే పరిశ్రమలో ఉత్పత్తి జరిగినప్పుడు గాలిలో 50 పీపీఎం వరకూ స్టైరీన్ మోనోమర్ విడుదలవుతుంటుంది. ఈ పరిమాణం వరకూ ఉంటే 8 గంటల పాటు విధులు నిర్వర్తించే ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బందేం లేదని నిపుణుల బృందానికి ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ సేఫ్టీ బృందం గణాంకాలతో సహా వివరించింది.
► ఆ కోణంలో విచారించేందుకు కమిటీ సిద్ధమవుతోంది.
► అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని కమిటీ సభ్యులు చెబుతున్నారు.
ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం..
ట్యాంకులో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గంటగంటకూ రీడింగ్ నమోదుచేసి ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల్ని గుర్తిస్తున్నాం. 30 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతకు చేరుకుంటే స్టైరీన్ మోనోమర్ ఘన స్థితిలోకి చేరుకుంటుంది. అప్పుడు లీకేజీ సమస్య ఉండదు. ప్రమాదానికి కారణాల్ని అన్వేషిస్తున్నాం.
– కరికాల వలవన్, రాష్ట్ర ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సభ్యుడు
సాధారణ స్థితికి చేరుకుంది
ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఎల్‌జీ పాలిమర్స్‌లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. మృతుల కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి పరిహారం ప్రకటించడం దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ ఎక్కడా లేదు. ప్రభుత్వానికి సలహాలివ్వాలిగానీ రాజకీయంగా రెచ్చగొట్టి పరిస్థితుల్ని మరింత ఉద్రిక్తం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
– ఆర్.వీరారెడ్డి, ప్రభుత్వ పరిశ్రమల శాఖ సలహాదారు
Comments
Please login to add a commentAdd a comment