
సాక్షి, విశాఖ : ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటనపై శుక్రవారం ఐఏఎస్‌ల హైపవర్ కమిటీ విచారణ ప్రారంభమైంది. కమిటీ ఛైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవెన్.. కమిటీ కన్వీనర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు వివేక్ యాదవ్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌లు ఈ విచారణలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అరగంటకు పైగా కంపెనీలో గ్యాస్ లీక్ అయిన తీరుపై అధికారులు, కార్మికులను విచారించారు.(గ్యాస్ లీక్ ఘటన: ఎక్స్‌గ్రేషియా విడుదల)
ప్రజలేవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి పరిస్థితి కొంత మేర అదుపులోకి వచ్చిందని, ప్రజలేవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైపర్ కమిటీ సభ్యుడు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వలవెన్ అన్నారు. శుక్రవారం గ్యాస్ లీకేజీ ఘటనపై హైపర్ కమిటీ విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన సాంకేతిక నిపుణులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రమాదంపై విచారణ ప్రారంభించాము. కంపెనీ అలారం మోగకపోవడంపై విచారణ చేస్తాము. గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తాము. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధించిన స్టోరేజ్ ట్యాంక్‌లను పరిశీలిస్తాము. ప్రత్యేక బృందం పరిస్థితులను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం గ్యాస్ ట్యాంక్ ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ’’ని తెలిపారు.