
సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేత ఆమంచి కృష్ణమోహన్ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీలైతే లొంగతీసుకోవడం, కుదరకపోతే బెదిరించడం, అదీ సాధ్యం కాకపోతే చంపడం పరిపాటిగా మారింది. రెండు రోజుల క్రితం తమకు ఎదురు తిరిగిందని గవినివారి పాలెంకు చెందిన దేవర సబ్బులు అనే మహిళపై ఆమంచి వర్గీయులు దాడికి పాల్పడ్దారు. ఈదాడిలో సుబ్బులు తీవ్ర గాయాలపాలైంది. దీంతో బాధితురాలిని కుటుంబ సభ్యులు చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే తీవ్రగాయలతో ఉన్న సుబ్బులు చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా ఆస్పత్రి వద్ద ఆమంచి వర్గీయులు మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావడాన్ని అడ్డుకున్నారు. దీంతో సుబ్బులు కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. అయితే చేతిలో అంగబలం, అధికార బలం ఉన్న ఆమంచి వర్గం రెచ్చిపోయింది. ఆందోళనకు దిగిన వారిపై కూడా దాడులకు పాల్పడ్డారు. అంతేకాకుండా మృతదేహాన్ని గ్రామంలోకి రానీకుండా అడ్డుకోవడానికి అనుచరులను గవినివారిపాలెంలో పెద్ద ఎత్తున్న మొహరించారు.
అధికారానికి పోలీసుల వత్తాసు : న్యాయంవైపు ఉండాల్సిన పోలీసులు కూడా ఆమంచి వర్గీయులకు వత్తాసు పలికారు. నాయకుల మెప్పు కోసం సుబ్బులు కుటుంబ సభ్యులను, వారికి మద్దతుగా వచ్చిన ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమ వారిని విడిచిపెట్టాలంటూ మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment