సాక్షి, చీరాల: ఎన్నికల్లో గెలవడానికి అధికార టీడీపీ అడ్డదారుల్లో ప్రయత్నాలు చేస్తోందని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. అధికార పార్టీ అండతో చీరాలలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను జైలుకి పంపుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్యాయంగా తన అన్నపై కేసు పెట్టారని తెలిపారు. ప్రమాదంలో కాలు చెయ్యి విరిగి సుదీర్ఘ కాలం వైద్యం తరువాత ఇప్పుడే పాక్షికంగా కోలుకున్న తన అన్న మీద హత్యాయత్నం కేసుపెట్టి, అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విజలిపేటలో యువకుల మధ్య జరిగిన గొడవలో తమ అన్నకు సంబంధం లేదన్నారు. తప్పుడు కేసులు పెట్టి అమాయకులను అరెస్టు చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో చీరాల టీడీపీ నేతల ప్రోద్భలంతో పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తన అన్నను ఒక్కడిని ఇబ్బంది పెడితే చీరాలలో వేలాది మంది అన్నలు, తమ్ముళ్లుతో కలసి ఎన్నికలలో దీటైన సమాధానం ఇస్తామని, టీడీపీ బెదిరింపులకు భయపడబోనని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment