సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు. ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇవాళ వైఎస్ జగన్ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్ లేదు. ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి వైఎస్ రాజశేఖర్ రెడ్డి...ఆయన వారసుడు జగన్. అందుకే వచ్చాను. మంచిరోజు చూసుకుని త్వరలో వైఎస్సార్ సీపీలో చేరతా. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా. నేను పార్టీ మారడానికి.. నా అసెంబ్లీ సమస్యలే కాదు, అనేకం ఉన్నాయి. స్థానికంగా నా ప్రత్యర్థి ఎవరైనా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నాలుగున్నరేళ్లుగా నేను చీరాల నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసాను అనేది ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే తెలుస్తుంది’ అని అన్నారు.
చంద్రబాబుకు పిచ్చి పట్టిందేమో!
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే ఆమంచి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే పిచ్చి పట్టినట్లు ఉందని, ఆయనకు 70 ఏళ్లు దాటయాని, అల్జీమర్స్ వచ్చిందనే అనుమానం కలుగుతుందన్నారు. ఈ రోజు ఒకమాట చెప్పి, తర్వాత మరో మాట చెబుతారని అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అతీత శక్తులు నడిపిస్తున్నాయని, సమాజంతో సంబంధం లేని వ్యక్తులు ముఖ్యమంత్రిని కలుస్తున్నారని ఆమంచి మండిపడ్డారు. పార్టీకి సంబంధం లేకున్నా తన నియోజకవర్గంలో రాజకీయంగా, సామాజికంగా అనేక ఇబ్బందులు కలిగించారని, ఈ అంశాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సీఎం నివాసంలో, ఆయన పేషీలో ఇతర వ్యక్తులు జోక‍్యం చేసుకున్నారని మండిపడ్డారు.
పసుపు-కుంకుమ పేరు చెడగొట‍్టారు..
చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు గాల్లో మేడలే. గత నాలుగేళ్లుగా రూ.6400 కోట్లు వడ్డీ రాయితీ ఇవ్వలేదు. వడ్డీ రుణం మాఫీ చేస్తామన్నారు. ఇప్పటివరకూ చేయలేదు. పసుపు-కుంకుమ పేరును చంద్రబాబు చెడగొట‍్టారు. పసుపు-కుంకుమను జారుడు బండపై పోశారు. అది గాల్లోకి కలిసిపోతోంది. ఇలాంటి దారుణమైన చర్యలు భరించలేకే వైఎస్సార్ సీపీలో చేరాను. తెలుగుదేశంలో కులం పిచ్చి ముదిరిపోయింది. ఒక కులం గుత్తాధిపత్యం కోసం యత్నిస్తోంది.
చిన్న విషయానికి హైదరాబాద్ వదిలేశారు..
కాపు రిజర్వేషన్లపై రాజకీయం చేయడం తగదు. తుని ఘటనలో మా సోదరుడిపై తప్పుడు కేసు పెట్టారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. మనం ఏం చెప్పినా వింటారనే భ్రమలో చంద్రబాబు ఉన్నారు. అనుభవొం ఉందని అధికారం ఇస్తే చిన్న విషయానికి హైదరాబాద్ నుంచి పారిపోయారు. అసలు హైదరాబాద్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది. అమరావతిలో ఉద్యోగులకు కనీసం మంచినీళ్లు, కూర్చోడానికి చెట్ల నీడ కూడా లేదు.
రోశయ్య ఆశీస్సులు తీసుకున్నా..
గతంలో పవన్ కల్యాణ్‌తో చాలాసార్లు భేటీ అయ్యాను. అయితే రాష్ట్ర సమస్యలపై చర్చించానే కానీ, జనసేనలో చేరతానని చెప్పలేదు. పార్టీ మారే ముందు మాజీ సీఎం రోశయ్య ఆశీస్సులు తీసుకున్నాను. అయిదు రోజుల క్రితం ఆయనను కలిశాను. నీ మనసుకు నచ్చిన విధంగా చేయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment