హైవే దిగ్బంధించి ఆందోళన
Published Thu, Sep 5 2013 5:29 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
కిర్లంపూడి, న్యూస్‌లైన్ : కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద కిర్లంపూడి మండలం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీ య రహదారి దిగ్బంధం, మహాధర్నా విజయవంతమైంది. నాలుగు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించి రోడ్డుపైనే బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎంపీడీఓ కేఎన్‌వీ ప్రసాదరావు, తహశీల్దార్ ఎస్ పోతురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి తోట నరసింహం, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబుతో పాల్గొన్నారు. ఉద్యమకారులను ఉత్తేజ పరిచేందుకు జేఏసీ ఏర్పాటు చేసిన కోలాటం, తప్పెటగుళ్లు, గరగ నృత్యం, కొమ్ము డ్యాన్స్‌లు, చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన బహిరంగ సభలో పలువురు నాయకులు ప్రసంగించారు.
మంత్రి నరసింహం మాట్లాడుతూ విభజన జరిగితే రాష్ట్రంలో అభివృద్ధితో పాటు నిరుద్యోగ సమస్య, తాగునీటి సమస్యలు మొదలవుతాయన్నారు. సీమాంధ్ర ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్రలోని 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమిస్తే కేంద్రం దిగివస్తుందన్నారు.సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలే నాయకులని అన్నారు. జీతాలు లేకపోయినా సమైక్యాంధ్రే లక్ష్యంగా ఉద్యోగుల ఆందోళన అభినందనీయమన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించినప్పుడే సమైక్యాంధ్రను కాపాడుకోగలమన్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి జ్యోతుల నెహ్రూ, మంత్రి తోట నరసింహం సారథ్యంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తే వారితో కలిసి పని చేయడానికి సిద్ధమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి విభజన ప్రక్రియ ఆగుతుందన్నారు. బహిరంగ సభకు హాజరైన సమైక్యవాదులకు ఎటువంటి అసౌకర్యంగా కలగకుండా తహశీల్దార్ ఎస్.పోతురాజు, ఎంపీడీఓ ప్రసాదరావు ఏర్పాట్లు చేశారు.
తోట వాణి, జ్యోతుల నవీన్ కుమార్, పంతం నానాజీ, ఎస్‌వీఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్యదొర, మంతిన నీలాద్రిరాజు, మారిశెట్టి వీరభద్రరావు, జేఏసీ నాయకులు పెంట కోట నాగబాబు, ఎస్‌ఎస్ రామ్‌కుమార్, తోట గోపి, పాటంశెట్టి సూర్యచంద్ర, చదలవాడ బాబి, కపిలవాయి సూరిబాబు, కంచుమర్తి రాఘవ, చాగంటి వీరబాబు, జంపన సీతారామ చంద్రవర్మ, బస్వా వీరబాబు, కపిలవాయి సూరిబాబు, గందం మహేశ్వరరావు, వి.అప్పారావు, ఉపాధ్యాయులు సీవీ కృష్ణమూర్తి, రాగం పాదాలు, జగ్గంపేట తహశీల్దార్ బాల సుబ్రహ్మణ్యం, ఉద్యోగ జేఏసీ సంఘం నాయకుడు టీజే స్వామి, కొత్త కొండబాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement