సాక్షి, హిందూపురం: విశ్రాంత ఐజీ, హిందూపురం వైఎస్సార్ సీపీ నేత షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈనెల 14న ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా.. అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి ఉన్న సంఖ్యాబలం పరంగా ఇక్బాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సోమవారం శాసనమండలి చాంబర్‌లో రిట్నరింగ్ అధికారి బాలకృష్ణామాచార్యులు ప్రకటించారు. అనంతరం ధ్రువపత్రాన్ని అందజేశారు. దీంతో హిందూపురంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఐజీ టూ ఎమ్మెల్సీ.. ఇక్బాల్ ప్రస్తానమిది
షేక్ మహమ్మద్ ఇక్బాల్ స్వగ్రామం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల. 1958 ఏప్రిల్ 24న జన్మించిన ఆయన.. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత పోలీసు శాఖలో ప్రవేశించి ఐజీ స్థాయికి ఎదిగారు. విధి నిర్వహణలో నిజాయతీ కల్గిన పోలీస్ అధికారిగా పేరు సంపాదించారు. అంతేగాక రాయలసీమ ఐజీగా ఓవైపు విధులు నిర్వహిస్తూ మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేశారు. విద్యార్థులకు కంప్యూటర్లు, కీడ్రాసామగ్రి, పుస్తకాల పంపిణీ చేశారు. తాగునీటి కోసం ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు క్రీడాప్రాగంణాలు అభివృద్ధి చేశారు. ఆయన ఐజీగా ఉన్న సమయంలోనే హిందూపురం ప్రాంతంలో కూడా పలు పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
హిందూపురం నుంచి పోటీ
ముందునుంచీ రాజకీయాలపై ఆసక్తి కల్గిన మహమ్మద్ ఇక్బాల్.. రాయలసీమ ఐజీగా పదవీ విరమణ పొందిన తర్వాత 2018 మే 16న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. రాజకీయ పరిజ్ఞానం మెండుగా ఉన్న మహమ్మద్‌ఇక్బాల్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక అభిమానాన్ని చూపారు. ఈక్రమంలోనే 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఎన్నికలకు కేవలం 22 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ తనవంతు కృషి చేశారు. అయినప్పటికీ స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూశారు.
మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ఐదు స్థానాలను మైనార్టీలకు కేటాయించింది. ఇందులో నాలుగు స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఓటమి చవిచూసిన ఇక్బాల్‌ను కూడా ఎమ్మెల్సీగా చేసి చట్టసభలకు తీసుకువెళ్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో జరిగిన ముస్లింమైనార్టీల సభలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇక్బాల్‌ను ఎమ్మెల్సీగా గెలిపించి తన మాటను నిలబెట్టుకున్నారు.
ముబారక్ ఇక్బాల్ సాబ్
రాజకీయ నాయకులకు ఎన్నికల సమయంలోనే మైనార్టీలు గుర్తుకువస్తారు. ఒకటో, రెండో సీట్లు ఇస్తారు. ఓడిపోతే వారివైపు కన్నెత్తి చూడరు. కానీ నేను ఓడినా సోదరభావంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో నిజమైన నాయకుడిని చూస్తున్నా. మైనార్టీల సంక్షేమంపై ఆయనకున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అన్ని వర్గాలు ఎదగాలని ఆకాంక్షించే నాయకుడి నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా.
– మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment