
పరిగి బస్టాండులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్
సాక్షి, హిందూపురం : ‘‘నేను ఎప్పుడూ హిందూపురం సేవకుడినే...అందరికీ అందు బాటులో ఉంటా. ప్రజా సమస్యల పరిష్కారం...పురం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా’’ అని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి బుధవారం హిందూపురం వచ్చిన ఆయనకు స్థానిక పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చి స్థానిక వైఎస్సార్ పరిగి బస్టాండులోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గజమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాధారణ కార్యకర్తగా ఉన్న తనను ఎమ్మెల్సీని చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిదన్నారు. వైఎస్సార్ సీపీతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపనిలోనూ ఉద్యోగ, రాజకీయాల్లో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే సిద్దాంతాన్ని ఆచరణలో పెడుతున్న నాయకుడన్నారు. ఆయనకు, హిందూపురం వాసులకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. అవినీతీ రహిత జవాబు దారీ పాలన అందించడమే తమ నాయకుడి లక్ష్యమన్నారు. ఏదైనా సమస్య వస్తే అర్ధరాత్రి అయినా సరే తన ఇంటి తలుపు తట్టవచ్చన్నారు.
అభివృద్ధికి సహకరిస్తాం
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటే తప్పకుండా తమ సహకారం అందిస్తామని ఎమ్మెల్సీ ఇక్బాల్ తెలిపారు. అలాకాకుండా నియోజకవర్గాన్ని వదిలి సినిమాలకే పరిమితమైతే ఏం చేయాలో ప్రజలే చేస్తారన్నారు. ఎమ్మెల్సీగా హిందూపురం వాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంతరెడ్డి, మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి, మారుతిరెడ్డి, జనార్దనరెడ్డి, ఏ బ్లాక్ కన్వీనర్ ఈర్షద్ అహ్మద్, మండల కన్వీనర్లు శ్రీరామిరెడ్డి, నారాయణస్వామి, ఫైరోజ్, యువజన విభాగం పార్లమెంట్ అధ్యక్షుడు ఉపేంద్రరెడ్డి పాల్గొన్నారు.