సాక్షి, విశాఖ: దక్షిణ అండమాన్‌కు ఆనుకొని ఆగ్నేయ బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో ఆవరించి ఉంది. బుధవారం తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. అనంతరం రానున్న 48 గంటల్లో బలపడి రెండు రోజుల పాటు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది.
గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రానున్న 3 రోజులు తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు రాయలసీమలో పొడిగాలులతో కూడిన వాతావరణం కొనసాగుతోంది.
పంటను ఇళ్లకు చేర్చుకోండి: అధికారులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలాల్లో కోత కోసిన వరిని నూర్పిళ్లు పూర్తి చేసి ఇళ్లకు చేర్చుకోవాలని, ఇతర వ్యవసాయోత్పత్తులను కూడా తడవకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోస్తాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగం రైతులకు సూచించింది. రెవెన్యూ అధికారులు దండోరా ద్వారా ప్రజలకు వాయుగుండం ప్రభావం గురించి ముందుగానే తెలియజేయడంతోపాటు వ్యవసాయ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. కోస్తా జిల్లాల్లోని రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు ఈమేరకు వ్యవసాయ అధికారులతో సమన్వయంతో వ్యవహరిస్తూ రైతులను చైతన్య పరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment