మరో వారందాకా ఇల్లే జైలు
మరో వారందాకా ఇల్లే జైలు
Published Fri, Jul 28 2017 2:18 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
- ఆగస్టు 2వ తేదీ వరకు గృహ నిర్బంధంలో ముద్రగడ
- కలెక్టర్ ఉత్తర్వులను అందజేయబోయిన పోలీసులు
- తిరస్కరించిన పద్మనాభం
- వచ్చే నెల 3 నుంచి పాదయాత్ర ప్రారంభించాలని ముద్రగడ నిర్ణయం
కిర్లంపూడి నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: కాపు రిజర్వేషన్ల పోరాట సమితీ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘చలో అమరావతి’ పాదయాత్ర రెండో రోజు గురువారం కూడా అడుగు ముందుకు సాగలేదు. కర్ఫ్యూను తలదన్నే రీతిలో విధించిన ఆంక్షలతో పోలీసులు ఆయనను స్వగ్రామం కిర్లంపూడిలోని ఇంటి నుంచి బయటకు కదలనివ్వలేదు. ముద్రగడను 24 గంటల క్రితం ఒక రోజు గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ముద్రగడ పాదయాత్రపై మరో వారం రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. దీంతో ముద్రగడకు ఆగస్టు 2వ తేదీ వరకు ఇల్లే జైలు కానుంది. సెక్షన్ 144 సబ్‌క్లాజ్(30) కింద జిల్లా కలెక్టర్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఈ సెక్షన్ గృహనిర్భందానికి సంబంధించినది కాదని ఆలస్యంగా గుర్తించిన జిల్లా ఎస్పీ రాత్రి 8 గంటల ప్రాంతంలో విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడ పాదయాత్రకు సంబంధించిన ఆంక్షలను మాత్రమేనని వివరించారు.
ముద్రగడను పోలీసులు ఇంటి నుంచి కదలనివ్వడం లేదు. గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో ఆయన, ఆయన అనుచరులు, పోలీసు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆగస్టు 2వ తేదీ వరకు అనుమతి ఇవ్వకపోతే 3న మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తానని ముద్రగడ ప్రకటించారు. వచ్చే నెల 2వ తేదీ వరకు గృహ నిర్బంధం విధించారని, ఇల్లు దాటి వెళ్లడానికి వీల్లేదంటూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని ముద్రగడకు పోలీసులు అందజేయబోగా ఆయన తిరస్కరించారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది. ముద్రగడ తన చేతులు ముందుకు చాచి... బేడీలు వేసి తీసుకువెళ్లండి. ఎందుకీ ఉత్తర్వులని ప్రశ్నించారు.
అనుచరులతో భేటీ
వచ్చే నెల 2వ తేదీ వరకు గృహ నిర్బంధం విధించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ముద్రగడ తన ఇంట్లో అనుచరులతో భేటీ అయ్యారు. న్యాయపరమైన వ్యవహారాలు, ఉద్యమ భవిష్యత్‌ను చర్చించారు. హైకోర్టు న్యాయవాదులు, మాజీ ఐఎఎస్ అధికారులతో ఫోన్లలో మాట్లాడారు. 3వ తేదీ ఉదయం పాదయాత్ర ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
Advertisement
Advertisement