అమలాపురం, న్యూస్‌లైన్ : ఉగ్ర గోదావరి ఉద్ధృతితో 16 మండలాల్లోని 59 గ్రామాలను ముంచెత్తిన వరద 1.45 లక్షల మందిపై తన ప్రతాపాన్ని చూపుతోంది. నమ్ముకున్న లంకవాసులకు నిలువునా ముంచింది. అన్నపానీయాలు లేకుండా పస్తులుండేటట్టు చేస్తోంది. నివాసగృహాలను ముంచెత్తి నిలువ నీడ లేకుండా చేసింది. పూరిపాకలే కాకుండా పక్కా ఇళ్లు కూడా కూలిపోతుండడంతో లంకవాసులు తట్టాబుట్టా పట్టుకుని ఏటిగట్లపై పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి ఏమాత్రం తగ్గలేదు. కోనసీమలోని లంకల్లో ముంపు మరింత పెరిగింది. డ్రైన్ల నుంచి వరదనీరు పోటెత్తడంతో మరికొన్ని గ్రామాలు ముంపుబారిన పడే ప్రమాదం ఉంది.
ఆదివారం రాత్రి భారీ వర్షం పడడంతో అటు లంకవాసులు, ఇటు డెల్టా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరదల వల్ల 10 రోజులుగా ఇళ్లు ముంపుబారిన పడడంతో జిల్లాలో ఇంతవరకు 250 గృహాలు కూలిపోగా దీనివల్ల రూ. 15 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. పాఠశాలల్లోను, ప్రభుత్వ కార్యాలయాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇవి కూడా ముంపుబారిన పడ్డాయి. దీనితో చాలామంది బాధితులు తమ డాబాలపైకి చేరి టార్పాలిన్ నీడన బతుకుతున్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ముమ్మిడివరం, పి.గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లో ఏటిగట్లపై గుడారాలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నవారు పదుల సంఖ్యలో ఉన్నారు. పాడిపంటలకు ఆలవాలమై సిరులు కురిపించిన గోదారే నమ్ముకున్న రైతులను, కౌలు రైతులను కుదేలు చేసింది. కోట్ల రూపాయల విలువైన పంటలను తనలో కలుపుకుపోయింది.
తుడిచిపెట్టుకుపోయిన కూరగాయలు
లంకలంటే అటు కూరగాయల సాగుకు, ఇటు వాణిజ్య పంటల సాగుకు బంగారు భూములు. ఈ సాగు చేసే రైతులు పంటలకు ఎంతైనా వెనకాడకుండా పెట్టుబడి పెడుతుంటారు. అటువంటి రైతులకు ఇప్పుడు చిన్న గడ్డిపోచ కూడా మిగల్చకుండా గోదావరి నట్టే ముంచింది. పెట్టుబడి పెట్టిన రైతుల పంటను ఎత్తుకుపోయి వెంట తెచ్చిన బురద మిగిల్చిపోయింది. జిల్లాలో 4,101 ఎకరాల్లో కూరగాయలు, వాణిజ్య పంటలు తుడిచిపెట్టుకుపోయి సుమారు రూ.13.50 కోట్ల నష్టం వాటిల్లింది. పశువుల పాకలను కూల్చి పశువులను చెల్లాచెదురు చేసింది. పాడిని దూరం చేసి రైతుల పొట్టను కొట్టింది. పశువులకు మేత లేకుండా చేయడంతో అవి ఆకలితో ఆలమటిస్తున్నాయి. సుమారు 10 వేల పశువులు, అదే సంఖ్యలో గొర్రెలు, మేకలు, కోళ్లు వరద బారిన పడడం రైతును నష్టపరుస్తోంది.
మత్స్యకారుల పరిస్థితి దుర్భరం
గోదావరి లంకల్లో శివారు ప్రాంతాలను ఆనుకుని వేటతో జీవనోపాధి పొందుతున్న మత్స్యకారుల పరిస్థితి దుర్భరంగా మారింది. వరదలు ప్రారంభమైననాటి నుంచి నేటి వరకు వేట లేకపోవడంతో జిల్లాలో సుమారు 15వేల మంది మత్స్యకారులు పూటగడవని పరిస్థితిలో ఉన్నారు. వేటాడే రోజుల్లో రోజుకు నిర్వహణ ఖర్చు పోను రూ.200 నుంచి రూ.300లోపు సంపాదించుకుంటారు. సుదీర్ఘకాలంపాటు వేట లేకపోవడంతో వీరి బాధలు వర్ణనాతీతంగా మారాయి. పడవలపై అందిస్తున్న అరకొర భోజనంతో బాధితులు పొట్టనింపుకుంటున్నారు. గోదావరి ఒడ్డున వేసుకున్న పాకలు కొట్టుకుపోవడంతో ఏటిగట్లపై తాత్కాలిక గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూకాలం వెళ్లదీస్తున్నారు. వరదలకు తోడు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షంతో గుడారాల్లో తలదాచుకున్నవారి పరిస్థితి దుర్భరంగా మారింది.
ఉపాధి కరువైన వ్యవసాయ కూలీలు
లంక ప్రాంతాల్లో నివాసముండేవారిలో అధికశాతం వ్యవసాయ కూలీలే. వరద వల్ల పొలాల్లో పనులు నిలిచిపోయాయి. ఉపాధి పనులు చేసే అవకాశం కూడా లేకపోయింది. దీనితో వీరు కూడా అర్ధాకలితో పొద్దుపుచ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ముంపునకు కొట్టుకు వస్తున్న విషసర్పాలు ఇళ్లల్లో చేరుతుండడంతో లంకవాసులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఆదివారం మామిడికుదురు మండలం అప్పనపల్లిలో విషసర్పం కాటేయడం తో ఆకుమర్తి నరసింహమూర్తి మృతిచెందిన విషయం తెలిసిందే. కళ్లముందు ఇంతటి విల యం సృష్టిస్తుండడంతో గోదారమ్మా.. శాంతించ మ్మా అంటూ లంకవాసులు పూజలు చేస్తున్నారు.
పదిహేను రోజులుగా ఏటిగట్టుపైనే కాపురం
మామిడికుదురు మండలం పాశర్లపూడికి చెందిన మల్లవరపు జయమ్మ కుటుంబం స్థానికంగా ఉన్న కొబ్బరితోటకు కాపలా కాయడంతోపాటు పశువులను మేపుతూ పొట్టపోసుకుంటున్నారు. మొదటిసారి వచ్చిన వరద ఉద్ధృతికి జయమ్మ ఇల్లు కొట్టుకుపోయింది. దీనితో ఏటిగట్టుపై గుడిసె వేసుకుని ఐదుగురు కుటుంబ సభ్యులతో నివాసముంటున్నారు. గత పదిహేను రోజులుగా ఆమె కుటుంబం ఈ గుడిసెలోనే కాలం వెళ్లదీస్తోంది. గోదావరి వరదల వల్ల కలిగిన ఇబ్బందులు చెప్పమంటే ఆమె కన్నీటి పర్యంతమైంది. ‘రెండు వారాల నుంచి ఈ గుడిసెలోనే కాపురముంటున్నాం. వరదకు పాములొస్తున్నాయి. ఇంట్లో చంటి పిల్ల కూడా ఉండడంతో ఏం జరుగుతుందోనని భయపడుతున్నాం’ అంటూ జయమ్మ వాపోయింది.
గోదారమ్మా.. శాంతించమ్మా...
Published Tue, Aug 6 2013 2:10 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement
Advertisement