గిరిజన యూనివర్సిటీపై ఆశలు | Hopes on Tribal university | Sakshi
Sakshi News home page

గిరిజన యూనివర్సిటీపై ఆశలు

Published Sat, Dec 7 2013 4:28 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

Hopes on Tribal university

 ఉట్నూర్, న్యూస్‌లైన్ :ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797ను విడుదల చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 2011 ఆగస్టు 27న జిల్లాలో యూనివర్సిటీ కోసం జీవో నంబర్ 783ను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్రాల ప్రకటనతో జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల 470 ఎకరాల పరం పోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించింది. అలాగే ఏడో నంబర్ జాతీయ రహదారికి 34 కిలోమీటర్ల దూరంలో రవాణ సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్తు తదితర సౌకర్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.
 
 ఆదిలోనే అడ్డుకట్ట
 జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించడంతో ఇతర జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో యూనివర్సిటీ జిల్లాలో కాకుండా ఖమ్మం జిల్లా భద్రాచలం, విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. జిల్లాలోనే గిరిజన యునివర్సిటీ ఏర్పాటు చేయాలని అప్పట్లో అందోళనలు జరిగాయి. వర్సిటీ ఏర్పాటు కోరుతూ హైదరాబాద్ వరకు ప్రస్తుత ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆశారెడ్డి తన పదెళ్ల కుమారుడు సాయికుమార్‌తో కలిసి 340 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడంతో యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన అటకెక్కిందని అంతా భావించారు. తాజాగా కేంద్రం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం.. కేంద్ర కేబినెట్ నోట్‌లోని పదకొండో అంశంలో విద్యాపరమైన అంశాల్లో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన ఉండటంతో జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తుంది.
 
 గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఆదిలాబాద్ జిల్లానే..
 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కొత్త రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఖమ్మం జిల్లా భద్రాచలం, వరంగల్ జిల్లా ఎటురునాగారం, మహబూబ్‌నగర్ జిల్లా సుండిపేటలో ఐటీడీఏలు ఉన్నాయి. ఈ జిల్లాలన్నింటిలో ఆదివాసీ గిరిజనులు అధికంగా ఉన్న జిల్లా ఆదిలాబాద్ జిల్లాలనే. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,794 ఆదివాసీ గిరిజనులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిదికి పైగా ఆదివాసీ గిరిజన తెగలు జీవిస్తున్నాయి. ఇతర జిల్లాల్లో మనకంటే తక్కువగా గిరిజనులు ఉన్నారు.
 జిల్లాలో గోండులు 2,63,515, లంబాడాలు 1,12,793, కోలాంలు 38,176, పర్‌దాన్‌లు 26,029, మన్నెవార్‌లు 15,370, నాయక్‌పోడ్‌లు 5,206, తోటీలు 2,231, ఎరుకల 1,735, ఇతర తెగలు 30,739 చొప్పున జనాభా నివసిస్తున్నారు. గిరిజన యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటు కావడం వల్ల గిరిజనులు అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. గిరిజనులకే కాకుండా గిరిజనేతరులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వర్సిటీ వల్ల గిరిజనుల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు పెరిగి జాతీయ, ప్రపంచస్థాయిలో గిరిజనులు వివిధ రంగాల్లో రాణించే అవకాశం ఉంది.
 
 ప్రజాప్రతినిధులపైనే భారం
 జిల్లాకు గిరిజన యూనివర్సిటీ రావాలంటే జిల్లా ప్రజాప్రతినిధులే కీలకమని అడవిబిడ్డలు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయాలను పక్కన బెట్టి జిల్లాలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి ప్రయత్నిస్తే యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. అన్ని సౌకర్యాలున్న ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా వేరే జిల్లాకు యూనివర్సిటీ తరలిపోతే అది మన జిల్లా ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమే అవుతుంది. యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఏ విధమైన ఒత్తిడి తెస్తారో చూడాలి.
 
 యూనివర్సిటీ కోసం ఉద్యమిస్తాం..
 గిరిజన యునివర్సిటీ ఏర్పాటు ద్వారా జిల్లా గిరిజనులే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజనులకు మేలు జరుగుతుంది. ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. విద్యా ప్రమాణాలు మెరుగు పడుతాయి. ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు విడుదల చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. జిల్లాలోనే వర్సిటీ ఏర్పాటు కోసం అవసరమైతే ఉద్యమిస్తాం.
 - వెడ్మా బోజ్జు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement