సీతంపేట: ఉద్యానవన పంటలు సాగుచేసే రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో గిరిజన రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందోనని అనుమానిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అయితే ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదని చెప్పి గిరిజన రైతులకు మొండిచేయి చూపింది. దీంతో గిరిజన రైతులు లబోదిబోమన్నారు. సీతంపేట ఏజెన్సీలో సుమారు పదివేల మంది రైతులు ఉన్నారు.
వీరికి కొండపోడు పంటలే ఆధారం. జీడిమామిడి, పసుపు, అల్లం, కంది, అరటి తదితర పంటలు పండిస్తారు. వీరిలో సుమారు 5,600 మంది రైతులు పంట సాగుకు రుణాలు తీసుకున్నారు. గతంలో ఖరీఫ్ వరిపై రుణాలు తీసుకున్నట్టుగా ఉన్న 445 మందికి మాత్రమే రుణాలు మాఫీ చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా వారికి రుణమాఫీ జరగలేదు. కుశిమి ఇండియన్ బ్యాంకులో 2 వేల మందికిపైగా రైతులు రుణాలు తీసుకున్నారు. కుశిమి ఇండియన్ బ్యాంకు ద్వారా అయితే ఎవరికీ రుణమాఫీ కాలేదు.
శంబాం, కోడిశ, కుడ్డపల్లి, కొండాడ, టిటుకుపాయి, మండ, కిల్లాడ, పెదపొల్లలో ఒక్కరైతుకు కూడా రుణమాఫీ జరగలేదు. ఏజెన్సీలో ఒక్కొక్క రైతు రూ. 30 వేలు లోపే రుణాలు తీసుకున్నారు. ఇవి కూడా మాఫీ కాకపోవడం పట్ల గిరిజనులు అసంతృప్తి చెందుతున్నారు. మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో ఉద్యానవన పంటలకు సైతం రుణమాఫీ జరిగిందని, ఇప్పుడు ఆ విధంగా జరగకపోవడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై పీహెచ్‌వో కె.బి.కర్ణ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఉద్యానవన పంటలు సాగుచేసే రైతుల రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని తెలిపారు. ఎవరెంత రుణాలు తీసుకున్నారనేదానిపై సర్వే చేస్తున్నామన్నారు.
వచ్చే ఖరీఫ్‌నకు పెట్టుబడి ఎలా
ఇప్పుడు అన్ని పంటలు పోయాయి. డబ్బులు లేవు. రానున్న ఖరీఫ్ ఎలా గట్టెక్కాలో తెలియని పరిస్థితి నెలకొంది. వరి, ఇతర పంటలను పండించలేం. సరైన ప్రేరణ లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
- ఎస్.బూదమ్మ, పెద్దగూడ
పోరాటం చేస్తాం
గతంలో పలుమార్లు రుణమాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. దీనిపై దశల వారీగా పోరాడతాం. గిరిజనులకు న్యాయం చేసేంతవరకు పోరాడతాం.
- పి.రాజబాబు,
జెడ్‌పీటీసీ సభ్యుడు, సీతంపేట
రుణమాఫీ వర్తించేనా?
Published Wed, Apr 27 2016 12:23 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement