
సాయంత్రానికే మూత
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సర్వజనాస్పత్రి రాత్రి 10 గంటలు... ఏడుగురు సభ్యుల ‘సాక్షి’ బృందం ఆస్పత్రిలోకి వెళ్లగానే ఆరుబయట రోగుల బంధువులు నిద్రపోతున్న దృశ్యం కన్పించింది. వారి మధ్యలో కుక్కలు తిరుగుతున్నాయి. ఏడుగురు మూడు బృందాలుగా విడిపోయి ఆస్పత్రి వార్డులను పరిశీలించారు. మొదట అడ్మిషన్ వార్డులోకి వెళ్లగానే ఓ వ్యక్తి రికార్డులు రాస్తున్నారు. రోజుకు ఎంతమంది రోగులు వస్తారని ప్రశ్నించగా.. 40-60మంది వస్తారని బదులిచ్చారు. ‘మీ పేరేంటని’ ఆరా తీయగా.. ఆ కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోయాడు. వాస్తవమేంటంటే అతను సెక్యూరిటీ గార్డు. అడ్మిషన్ రికార్డులు రాసే వ్యక్తి రాలేదు.
రోజూ ఇదే తంతు! తర్వాత ఎమర్జెన్సీలోకి వెళ్లగా.. క్యాజువాలిటీలో డాక్టర్ శారద, ఫిజీషియన్ మురళీ, సర్జన్ విజయలక్ష్మి రాత్రి విధుల్లో ఉన్నారు. స్టాఫ్ నర్సులూ ఉన్నారు. అంతలోనే 108 వాహనం వచ్చి ఆగింది. లోపల ఓ యువకుడు తీవ్ర గాయాలతో ఉన్నాడు. ఇతన్ని కిందకు దించేందుకు సిబ్బంది ఎవ్వరూ రాలేదు. నడవలేని స్థితిలో ఉన్నా స్ట్రెచర్ తీసుకురాలేదు. అనంతపురం మూడోరోడ్డుకు చెందిన శేఖర్ అనే ఆ యువకుణ్ని స్నేహితులే చేతులపై తీసుకుని ఎమర్జెన్సీలో చేర్పించారు.
అక్కడి నుంచి ఆర్థోపెడిక్ వార్డుకు వెళ్లాం. అక్కడ కుక్కలు గుంపుగా కన్పించాయి. వార్డులో డాక్టర్లెవరూ లేరు. డ్యూటీ నర్సులు ఉన్నారు. తర్వాత గైనిక్ వార్డుకు వెళ్లగా గైనకాలజిస్ట్ లక్ష్మీకాంత ఉన్నారు. ఇక్కడ భద్రత విధులు మహిళ నిర్వహించాలి. కానీ పురుషుడు ఉన్నారు. పీడియాట్రిక్, బ్లడ్‌బ్యాంకు వద్ద గార్డులు లేరు. తక్కిన వార్డుల్లో డ్యూటీ డాక్టర్లంతా విధుల్లో ఉన్నారు.
24గంటల ఆస్పత్రులు మరీ దారుణం
జిల్లాలో రౌండ్‌ది క్లాక్ పనిచేయాల్సిన ఆస్పత్రులను ‘సాక్షి’ క్షేత్రస్థాయి సిబ్బంది పరిశీలించింది. మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడిచెరువు, పాముదుర్తి ఆస్పత్రులకు సాక్షి విలేకరులు రాత్రి తొమ్మిది గంటలకు వెళ్లారు. అప్పటికే ఆ ఆస్పత్రులు మూత వేసి ఉన్నాయి. కొత్తచెరువు, బుక్కపట్నం ఆస్పత్రులు తెరిచి ఉన్నా డాక్టర్లు లేరు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం(రాప్తాడు)లోనూ ఇదే తీరు.
కనగానపల్లి, నాగసముద్రం, రామగిరి, ఆత్మకూరు పీహెచ్‌సీలను తనిఖీ చేయగా.. ఆత్మకూరు మినహా ఎక్కడా డాక్టర్లు లేరు. ఆత్మకూరులో కూడా హౌస్‌సర్జన్ విధులు నిర్వర్తించారు. హిందూపురం ఆస్పత్రిలో పరిస్థితి మరీ దారుణం. విలేకరులు రాత్రి 10 గంటలకు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ 181 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కానీ 100 పడకలే ఉన్నాయి. ఒక్కో బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు ఉన్న దృశ్యాలు కనిపించాయి. రాత్రి విధుల్లో డాక్టరు లేరు. ఫోరెన్సిక్ నిపుణుడు రోహిల్ మాత్రమే ఉన్నారు.
చిలమత్తూరు, లేపాక్షి ఆస్పత్రులలోనూ రాత్రి విధుల్లో డాక్టర్లు లేరు. ఇక్కడ రోజూ ఇదే పరిస్థితి. హిందూపురం, కదిరి ఆస్పత్రిలో మంచినీటి సౌకర్యం లేక రోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పెనుకొండ ఆస్పత్రిలో రాత్రి 9.45 గంటలకు విలేకరులు వెళ్లగా.. ఒక్క డాక్టరూ కన్పించలేదు. ఏఎన్‌ఎం మాత్రమే ఉన్నారు. ఆరా తీస్తే..‘ఆన్ ఫోన్‌కాల్స్ డ్యూటీ చేస్తామన్నారు. జిల్లాలోని మొత్తం 42 రౌండ్‌ది క్లాక్ ఆస్పత్రులలో 29 ఆస్పత్రులను సాయంత్రానికే మూసేశారు.