నేడు ప్రభుత్వాస్పత్రిలో మంత్రి కామినేని ‘ఆస్పత్రి నిద్ర’
ఏసీ గదిని సిద్ధం చేసిన అధికారులు
రోగుల ఇబ్బందులను తెలుసుకునే అవకాశం
సమస్యల పరిష్కరానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది
లబ్బీపేట : ‘ఆస్పత్రి నిద్ర’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదివారం రాత్రి నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో నిద్రించనున్నారు. ఇందుకు సంబంధించి ఆస్పత్రి అధికారులు డయాగ్నొస్టిక్ బ్లాక్‌లో ఒక గదిని సిద్ధంచేశారు. మంత్రి రాత్రి వేళ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలిస్తారని తెలిసింది. దీంతో ప్రభుత్వాస్పత్రిలో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు మంత్రి దృష్టికి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే ఆస్పత్రి సమస్యలపై పలుమార్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, కనీసం ‘ఆస్పత్రి నిద్ర’ తర్వాత అయినా వాటికి పరిష్కారం చూపాలని పలువురు వైద్యులు కోరుతున్నారు.
డాక్టర్ గారూ.. వీటిపై దృష్టిపెట్టండి..
ఆస్పత్రిలో రేడియోగ్రాఫర్లు, సీటీ స్కానింగ్ టెక్నీషియన్‌ల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల రాత్రి 8 గంటల తర్వాత సీటీ స్కానింగ్ యంత్రం నిలిచిపోతుంది. మధ్నాహ్నం 12 గంటలు దాటితే రక్త పరీక్షల కోసం ప్రయివేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. కడుపు నొప్పితో బాధపడేవారికి ఆల్ట్రా సౌండ్ స్కాన్ చేయాల్సి వచ్చినా ప్రయివేటు సెంటర్లకు పరుగులు తీయాల్సిందే. రాత్రి వేళ ఒక్కోసారి ఈసీజీ తీసేందుకు కూడా సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. రెండు, మూడు వార్డులకు ఒకే స్టాఫ్ నర్సు విధులు నిర్వహిస్తుంటారు. అర్ధరాత్రి వేళ రోగులకు ఎమైనా అయితే పరుగులు పెట్టాల్సిందే.
రేడియోగ్రాఫర్లను నియమించాలని, సీటీ టెక్నిషియన్లను అపాయింట్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులకు రెండు సంవత్సరాలుగా లేఖలు రాసినా పట్టించుకోవడం లేదు. నాలుగు నెలల క్రితం ప్రభుత్వాస్పత్రికి డిజిటల్ ఎక్స్‌రే మిషన్ వచ్చినా, రేడియోగ్రాఫర్ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. కొత్త, పాత ఆస్పత్రుల్లో ఒక్కరే రేడియోగ్రాఫర్ ఉండటంతో సమస్య తలెత్తింది. ప్రభుత్వాస్పత్రిలో ఉన్న రెండు లిఫ్ట్‌లు నాలుగు నెలలుగా పనిచేయడంలేదు. దీంతో రోగులు పై అంతస్తులకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు.పలు వార్డుల్లో, ప్రొఫెసర్ల గదుల్లో పైకప్పు శ్లాబ్ పెచ్చులూడి పడుతున్నాయి.
ఆస్పత్రిలోని రెండు ఆపరేషన్లు రెండేళ్లుగా మూతపడి ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిన కొద్దీ థియేటర్లు పెరగాల్సి ఉండగా, ఇక్కడ మూతపడటంతో ఆపరేషన్లు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని ఏడు నెలల క్రితం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. డ్రెయినేజీలు, రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షం వస్తే ఆస్పత్రి ప్రాంగణం జలమయంగా మారుతోంది. మంత్రి ఈ విషయాలపై దృష్టి సారిస్తే రోగులకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంది.
సీను మారేనా..!
Published Sun, Feb 22 2015 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement