'బిగ్‌బాస్ ఎవరో బయటపెట్టండి' | Hot Discussions on Black Money in Andhra pradesh Assembly session | Sakshi
Sakshi News home page

'బిగ్‌బాస్ ఎవరో బయటపెట్టండి'

Published Tue, Jun 24 2014 11:32 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

'బిగ్‌బాస్ ఎవరో  బయటపెట్టండి' - Sakshi

'బిగ్‌బాస్ ఎవరో బయటపెట్టండి'

హైదరాబాద్ : విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తెప్పించే ఉద్దేశంతో కేంద్రం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడాన్ని ఏపీ అసెంబ్లీ అభినందించింది.  నల్లధనం తీర్మానంపై  వైఎస్ జగన్ మాట్లాడుతూ విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తెప్పించేందుకు నరేంద్ర మోడీ సర్కార్ చేస్తున్న కృషి హర్షనీయమన్నారు. నల్లధనంపై తీసుకుంటున్న చర్యలను తాము స్వాగతిస్తున్నామన్నారు.

ఈ సందర్బంగా నల్లధనంపై సభలో వాగ్వాదం జరిగింది. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. స్టాక్ మార్కెట్ బ్రోకర్ హసన్ అలీ పేర్కొన్న బిగ్‌బాస్ ఎవరో వెల్లడించాలని విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 2004కు ముందు ఇద్దరు సీఎంలు ఎన్నికల కోసం డబ్బులు తెప్పించుకున్నారంటూ హసన్ అలీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన... ఆ వివరాలను కూడా సిట్‌కు అందిస్తే బాగుంటుందని సూచించారు. అలాగే ఇటీవలి జరిగిన ఎన్నికల్లో ఎవరు ఎంత ఖర్చు పెట్టారో ఆ నియోజకవర్గాల ప్రజలను అడగాలని జగన్ అన్నారు.

ఐఎంజీ కేసులో  స్టే ఎందుకు తెచ్చుకున్నారు
అవినీతిపై పోరాటమంటూ పదే పదే మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు... ఐఎంజీ కేసులో ఎందుకు స్టే తెచ్చుకున్నారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఐఎంజీ కేసులో చంద్రబాబు స్వయంగా సీబీఐ విచారణ జరిపించుకోగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై చాలా కేసులు ఉన్నాయన్నారు.

బాబు జమానా అవినీతి ఖజానాపై స్పందించండి

అవినీతిపై సిట్ ఏర్పాటును అభినందిస్తూ ఏపీ శాసనసభలో చేసిన తీర్మానంపై చర్చలో భాగంగా సభానాయకుడు చంద్రబాబు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై చేసిన ఆరోపణలపై విపక్షనేత వైఎస్ జగన్ దీటుగా స్పందించారు. బాబు పాలనపై సీపీఐ వేసిన 'బాబు జమానా అవినీతి ఖజానా' విషయాలను కూడా చంద్రబాబు పేర్కొని ఉంటే ఇంకా బాగుండేదని చురకలంటించారు. వారు ఏం చేశారన్నది వారి మనస్సాక్షికి తెలుసు అని జగన్ వ్యాఖ్యానించారు.

ఇతర పార్టీల నేతలను లాక్కోవడమే పని

అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయడమే పక్కకు పెట్టి ఇతర పార్టీల నేతలను లాక్కోవడమే పనిగా పెట్టుకుందని టీడీపీపై వైఎస్ జగన్ మో హన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి లాక్కుంటూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎంపీ, ఎమ్మెల్సీలను సైతం ప్రలోభపెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఏడుగురు కౌన్సిల్ సభ్యులను టీడీపీ తమ పార్టీలోకి చేర్చుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్షమనేది లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.

టీడీపీ దాడుల్లో 17మంది చనిపోయారు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో  ఎన్నికల్లో ఓట్లు వేయనివారిపై దాడులకు దిగటమే పనిగా పెట్టుకుందని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. రైతుల తోటలు ధ్వంసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ దాడుల్లో తమ పార్టీకి చెందిన 17మంది చనిపోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో 110మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. తప్పులు జరిగినప్పుడు చర్యలు తీసుకునే నాయకత్వం కావాలని ఆయన అన్నారు.  తమ పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కనీసం ఖండించడం కూడా చేయలేదని మండిపడ్డారు. కాగా సభలో లేనటువంటి సభ్యుల గురించి మాట్లాడటం సరికాదని వైఎస్ జగన్ అన్నారు. వారిపై అభాండాలు వేయటం సరికాదని జగన్ అన్నారు.

ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు

కుట్రలు, కుతంత్రాలు మాని రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై దృష్టి పెట్టాలని వైఎస్ జగన్ సూచించారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే వారికి ఓటేసిన ప్రజలే ప్రతిపక్షంగా మారతారని హెచ్చరించారు. తాము కాంగ్రెస్ పార్టీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే టీడీపీ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేదా అని జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనిపై గుండెలపై చెయ్యేసుకొని చెప్పండంటూ సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement