కర్నూలు(హాస్పిటల్): ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ హామీ అభాసుపాలవుతోంది. మొదటి మూడు రోజుల్లోనే అందరికీ పింఛన్లు పంపిణీ చేయాలనే ఒత్తిళ్ల నేపథ్యంలో అందరినీ ఒక్క చోటికి పిలిపించి మమ అనిపించేస్తున్నారు. ఇప్పటికీ ప్రతి నెలా ఆరు శాతానికి పైగా పింఛన్లు ఇవ్వకుండానే ఖాతాలు మూసేస్తున్నారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 1,43,916.. వితంతు పింఛన్లు 1,23,053.. వికలాంగుల పింఛన్లు 39,844.. చేనేత కార్మిక పింఛన్లు 3,617.. కల్లు గీత కార్మికులు 161 మందికి కలిపి ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద మొత్తం 3,10,591 పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రూ.34,51,13,500 ఖర్చు చేస్తోంది. జిల్లాలో ఈ నెల బుధవారం వరకు 94.25 శాతం మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేశారు. ఇక ఒకరోజు మాత్రమే గడువుంది. ఏడు రోజుల అనంతరం సర్వర్‌ను మూసేస్తారు. మిగిలిన వారికి మళ్లీ వచ్చే నెలలోనే పింఛన్ల పంపిణీ జరగనుంది. అదేవిధంగా పంచాయతీ కార్యాలయాలు, నీళ్లట్యాంకులే అడ్డాలుగా చేపడుతున్న పంపిణీ లబ్ధిదారులకు విసుగు తెప్పిస్తోంది.
ప్రతి నెలా 18వేల మందికి మొండిచెయ్యి
ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేయకపోవడం, వారం రోజుల్లోనే పంపిణీ ముగించేస్తుండటంతో ప్రభుత్వం లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ప్రతి నెలా వచ్చే రూ.1000 కోసం ఎంతో ఆశగా ఎదురుచూసే వారికి వచ్చినట్లే వచ్చి పింఛన్ రాకుండా పోయేసరికి తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. జిల్లాలో 3,19,591 మందికి పింఛన్లు పంపిణీ చేస్తుండగా.. అందులో 6 శాతం అంటే 18వేల మందికి పైగా పింఛన్లు అందుకోలేకపోతున్నారు. వీరికి మరుసటి నెలలో ఇస్తామని చెబుతున్న అధికారులు.. తిరిగి ఆ నెలలోనూ అంతే శాతం మందికి మొండిచేయి చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది.
ఇంటింటికీ పింఛను.. ఎవరికి పట్టేను!
Published Thu, Apr 7 2016 3:57 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM
Advertisement
Advertisement