పేకమేడలా కట్టేస్తూ.. | Houses is Being Built Dangerously in Anantapur | Sakshi
Sakshi News home page

పేకమేడలా కట్టేస్తూ..

Published Mon, Aug 26 2019 8:05 AM | Last Updated on Mon, Aug 26 2019 8:08 AM

Houses is Being Built Dangerously in Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : కనీస ప్రమాణాలు వెతికినా కనపడవు.. నిబంధనల పాటింపులు అసలే ఉండవు.. అడ్డుకోవాల్సిన వాళ్లే సహకరించారనే ధీమానే ఏమో.. ఇష్టమొచ్చినట్లుగా అక్రమాలకు తెరలేపారు. కొద్దిపాటి స్థలంలోనే పేకముక్కలు పేర్చినట్లుగా నిర్మాణాలను పైకి లేపారు. గతంలో పాలకుల అండా ఉండడంతో ఇలాంటివి నగరంలో వీధికొకటి చొప్పున వెలిశాయి. ప్రస్తుతం కూడా కొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాణదారులు ధనార్జనే ధ్యేయంగా నిర్మాణాలు చేపడుతున్నా.. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు.  

కమర్షియల్‌ దందా  
నగరంలోని కమలానగర్, సాయినగర్, ఆర్టీసీ బస్టాండ్, కొత్తూరు తదితర ప్రాంతాలు కమర్షియల్‌ ఏరియా కింద వస్తాయి. ఇటువంటి ప్రాంతంలో సెంటు భూమి రూ. లక్షల్లో పలుకుతుంది. నిర్మాణదారులు కమర్షియల్‌ భవనాలు ఏర్పాటు చేసి రూ. లక్షల్లో బాడుగులకు ఇచ్చుకుంటారు. నగరపాలక సంస్థలో ఇటువంటి భవనాలకు అనుమతులు లభించవు. ఒక వేళ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నా.. అక్కడి రోడ్డు విస్తీర్ణం కనుగుణంగా అనుమతులు లభించే పరిస్థితి లేదు. కానీ, నిర్మాణదారులు మాత్రం ఎటువంటి అనుమతులు లేకుండా అగ్గిపెట్టెల్లా నిర్మాణాలు చేపడుతున్నారు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదాలు జరిగితే ఆస్తి నష్టంతో పాటు ప్రాణం నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు.  

చర్యలేవీ? 
నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. గత కొన్నేళ్లుగా నగరంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా వారు పట్టించుకోవడం లేదు. నిర్మాణదారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడంతోనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్వరగా భవనాలు నిర్మించుకోవాలని, బీపీఎస్‌లో అనుమతులు తీసుకోవచ్చని వారే చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు.  

నేటి సమావేశంతోనైనా చెక్‌ పడేనా? 
నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రశాంతి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తనదైన మార్క్‌తో దూసుకుపోతున్నారు. అక్రమాల ఆటకట్టించేందుకు తనదైన శైలిలో ముందుకుపోతున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అక్రమార్కులకు, వారికి సహకరిస్తున్న అధికారులకూ చెమటలు పట్టిస్తున్నారు. ఈ క్రమంలో కమిషనర్‌ సోమవారం టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే నగరంలో వెలసిన, ప్రస్తుతం వెలుస్తున్న భవనాలపై ఈ సమావేశం ద్వారా ఆమె ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో చూడాల్సి ఉంది. అలాగే, గత ప్రభుత్వ హయాంలో నగరంలో పలు చోట్ల ప్రభుత్వ స్థలాలను కొందరు పాల కులు తమ స్వలాభం కోసం అన్యాక్రాంతం చేశారు. రెండు రోజుల క్రితం రామ్‌నగర్‌లో ఇలాంటి ఓ భవనాన్నే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో అనేక చోట్ల ఇలాగే అక్రమార్కుల చేతుల్లో ఉన్న భవనాలనూ స్వా«ధీనం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement