ఖమ్మం నగరంలో నిరుపయోగంగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్(ఎన్‌ఎస్‌పీ) కాల్వలను ఆక్రమించి, నిర్మించిన గుడిసెలను రెవెన్యూ అధికారులు బుధవారం పోలీసు బందోబస్తుతో తొలగించారు.
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: ఖమ్మం నగరంలో నిరుపయోగంగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్(ఎన్‌ఎస్‌పీ) కాల్వలను ఆక్రమించి, నిర్మించిన గుడిసెలను రెవెన్యూ అధికారులు బుధవారం పోలీసు బందోబస్తుతో తొలగించారు. తమ గుడిసెలను తొలగించవద్దంటూ గుడిసె వాసులు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇదీ నేపథ్యం...
పాకబండ రెవెన్యూ, వెలుగుమట్ల రెవెన్యూలోని నాగార్జున సాగర్ మేజర్ కాల్వల్లో కొంతవరకు ఖమ్మం కార్పొరేషన్‌లో ఉన్నాయి. వీటిని కొందరు పేదలు కొన్నేళ్ల కిందట ఆక్రమించి గుడిసెలు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ కాల్వల స్థలాలను మరికొందరు బడా బాబులు కూడా ఆక్రమించి, భవనాలు.. ఇతరత్రా కట్టడాలు నిర్మించారు.
ఇక్కడి ఆక్రమణలు.. గుడిసెలతో తాము ఇబ్బందిపడుతున్నామని, వాటిని తొలగించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ ఆ పరిసర ప్రాంతాల్లోని పట్టాదారులు కొందరు పదేళ్ల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. ఆక్రమణలను తొలగించాలంటూ 2008లో రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తొలగింపులో అడ్డంకులు, ఇబ్బందులు ఉన్నాయంటూ రెవెన్యూ అధికారులు హైకోర్టుకు నివేదిస్తూ, ఎప్పటికప్పుడు వాయిదా కోరుతూ వచ్చారు.
ఎప్పటిలాగే గత సోమవారం వాయిదాకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలను తొలగించాల్సిందేనని ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. ఆక్రమణల తొలగింపును రెవెన్యూ అధికారులు బుధవారం ప్రారంభించారు.
అడ్డుకున్న గుడిసె వాసులు
నగరంలోని మమత రోడ్డు, గొల్లగూడెం రోడ్డు, హార్వెస్ట్ పాఠశాల, మమత హాస్పిటల్ తదితర ప్రదేశాల్లోని సాగర్ కాల్వలపై నిర్మించిన గుడిసెలను, భవనాలను జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఎస్పీ రంగనాథ్ ఎవి.రంగనాధ్ బుధవారం ఉదయం పరిశీలించారు. వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు.
తొలుత.. కాల్వను ఆక్రమించి కట్టిన హార్వెస్ట్ పాఠశాల ప్రహరీ గోడను, మమత ఆస్పత్రి యాజమాన్యం వేసిన ఫెన్సింగ్‌ను, కాంపౌండ్ వాల్‌ను సిబ్బంది తొలగించారు. ఆ తరువాత గుడిసెలను తొలగించేందుకు వెళుతున్న జేసీబీని సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, కొందరు నాయకుల ఆధ్వర్యంలో గుడిసె వాసులు అడ్డుకున్నారు. జేసీబీ, ట్రాక్టర్ల వాహనాల టైర్లలోని గాలిని తీశారు. అక్కడ రెండు గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది.
వారిని పోలీసులు అరెస్టు చేశారు. గుడిసె వాసులైన ఇద్దరు మహిళలు పాఠశాల ఎదురుగాగల భవనం పైకి ఎక్కి, తమ గుడిసెలను తొలగిస్తే కిందకు దూకుతామంటూ బెదిరించారు. వీరికి పోలీసులు నచ్చచెప్పి కిందకు తీసుకొచ్చారు. శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిన ఓ యువకుడిని పోలీసులు అడ్డుకున్నారు. తమను వీధులపాలు చేయొద్దంటూ గడిసె వాసులు అధికారుల కాళ్లావేళ్లా పడి వేడుకున్నారు. కొందరు బిగ్గరగా ఏడ్చారు. హైకోర్టు ఆదేశాలను వారికి వివరించేందుకు ఆర్డీవో సంజీవరెడ్డి ప్రయత్నించారు.
ఆక్రమణలను తొలగించాల్సిందే...
సాగర్ మేజర్ కాల్వలపై ఆక్రమణలన్నిటినీ తొలగించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ఎస్పీ ఎవి.రంగనాథ్ ఆదేశించారు. మమత రోడ్డు, గొల్లగూడెం రోడ్డు, హార్వెస్ట్ పాఠశాల, మమత హాస్పిటల్ ప్రాంతాల్లోని, పాకబండ రెవెన్యూలోని సాగర్ కాల్వలపై ఆక్రమణలు, నిర్మాణాలను వారు బుధవారం ఉదయం పరిశీలించారు.
వాటికి మార్కింగ్ చేయాలని అర్బన్ తహశీల్దార్‌ను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో నగర కమిషనర్ శ్రీనివాసరావు, వివిధ మండలాల తహశీల్దారులు ప్రకాష్, వెంకారెడ్డి, శ్రీనివాస్, రాజేంద్రకుమార్, అశోక చక్రవర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
47 ఎకరాల్లో ఆక్రమణలు
సాగర్ మేజర్ కాల్వలకు సంబంధించి సుమారు 47 ఎకరాల స్థలం ఆక్రమణలో ఉన్నట్టుగా రెవెన్యూ అధికారులు గతంలోనే గుర్తించారు.
43.25 ఎకరాల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారని, ఎకరం 20 కుంటల స్థలం మమత ఆస్పత్రి ఆక్రమణలో ఉందని, ఒక ఎకరం మూడు కుంటల స్థలం హార్వెస్ట్ పాఠశాల ఆక్రమణలో ఉందని, ఒక ఎకరం మూడు కుంటల స్థలం ఆర్ అండ్ బీ రహదారుల్లో కలిసిందని రెవెన్యూ అధికారులు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపారు.