హౌసింగ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి | Housing DE houseACB attack | Sakshi
Sakshi News home page

హౌసింగ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి

Published Fri, Sep 13 2013 3:53 AM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM

గృహ నిర్మాణశాఖ పొదిలి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చేబ్రోలు రామాంజనేయులు అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు.

ఒంగోలు, న్యూస్‌లైన్ : గృహ నిర్మాణశాఖ పొదిలి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చేబ్రోలు రామాంజనేయులు అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. మొత్తం ఆరుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆయన పనిచేసే పొదిలి గృహనిర్మాణశాఖ కార్యాలయం, ఒంగోలులోని ఆయన నివాసగృహం, ఆయన స్వగ్రామం రావినూతల, ఒంగోలులోని ఆయన బంధువుల నివాస గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ భాస్కరరావు, ఒంగోలు సీఐ టీవీ శ్రీనివాసరావులు ఇతర జిల్లాల్లో పనిచేసే తమ సిబ్బంది సహకారంతో ఈ దాడులు కొనసాగించారు. 
 
 గురువారం రాత్రి వరకు కూడా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా అనేక కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని బృందావనంలో రెండంతస్తుల మేడ ఒకటి, గుండ్లాపల్లిలో మూతపడిన నాగభైరవ జూనియర్ కాలేజీ స్థలాన్ని రామాంజనేయులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అంతే కాకుండా ఇంకా రాష్ట్రవ్యాప్తంగా 15 చోట్ల స్థలాలను కొనుగోలు చేసినట్లు ధ్రువపరిచే పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల్లో బ్యాలెన్స్ వివరాలపై కూడా ఏసీబీ అధికారులు దృష్టిసారించారు. 
 
 శుక్రవారం ఈ లాకర్లను తెరిపించి అందులో ఉన్న వాటి వివరాలను కూడా సేకరించనున్నారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ భాస్కరరావు మీడియాతో మాట్లాడుతూ పొదిలి, ఒంగోలు, రావినూతలలో మొత్తం ఆరు టీములు తనిఖీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. తమకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం కోటి రూపాయలకుపైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇటీవల రామాంజనేయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చే స్తుండటంతో ఏసీబీకి ఫిర్యాదులు అండిన నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
 
  హౌసింగ్ కార్యాలయంలో సోదాలు
 పొదిలి, న్యూస్‌లైన్ : స్థానిక గృహ నిర్మాణశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఈ రామాంజనేయులుపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వివిధ ఆధారాలు సేకరించారు. నెల్లూరు ఏసీబీ ఇన్‌ప్పెక్టర్ ఎం.కృపానందం ఆధ్వర్యంలో కార్యాలయంలోకి వచ్చిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. డీఈ బీరువా, టేబుల్ సొరుగులలో ఉన్న రికార్డులను పరిశీలించారు.  
 
 డీఈ బంధువుల ఇళ్లలో దాడులు
 మేదరమెట్ల, న్యూస్‌లైన్ : పొదిలి హౌసింగ్ డీఈ చేబ్రోలు పెద్ద రామాంజనేయులు గృహంతో పాటు, అతని బంధువుల గృహాల్లో గురువారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని రావినూతల గ్రామంలో ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. సోదాలు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు కొనసాగాయి. రామాంజనేయులు తల్లి సుబ్బాయమ్మ, అత్త మోపర్తి జయమ్మకు చెందిన ఇళ్లలో క్షుణ్ణంగా గాలించారు. పొలం, స్థలాల తాలూకా డాక్యుమెంట్లు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు సీహెచ్ చంద్రమౌళి, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement