సాక్షి, విజయవాడ: ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లతో కనీసం 50 శాతం వీవీప్యాట్‌లతో సరిపోల్చాలన్న విపక్షాల అభ్యర్ధనను సుప్రీంకోర్టు తిరస్కరించిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి వీవీ ప్యాట్లను లెక్కించాలని అడగడం ఆశ్చర్యంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈవీఎంలపై చంద్రబాబుకు అనుమానాలు ఎందుకని, ఎన్నికల కమిషన్‌ను అవమానించే విధంగా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేసినప్పుడు ఇవే ఈవీఎంలు ఉన్నాయని, అప్పుడు లేని అనుమానం ఇప్పుడెందుకని ప్రశ్నించారు.
ఓటమికి ముందే చంద్రబాబు కారణాలు వెతుకుతున్నారని, ఓటమిని ఈవీఎంలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంబటి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కేబినెట్ సమావేశం పెట్టాలా వద్దా అనే విషయం చంద్రబాబు తెలీదా?. కేబినెట్ సమావేశం 10 నుంచి 14కు ఎందుకు మారింది?. సమావేశానికి సీఎస్ వస్తారా లేదా అనేది చంద్రబాబు ఆలోచన. పంతాల కోసం చంద్రబాబు కేబినెట్ సమావేశం పెడతారా?. వ్యవస్థను సవాల్ చేసే కార్యక్రమంలో చంద్రబాబు ఉన్నారు. ఈనెల 23 తరువాత సీఎంగా ఉండే అవకాశం లేదని చంద్రబాబుకు తెలుసు. లంచాల వల్లే అమరావతి తాత్కాలిక నిర్మాణాల్లో నాణ్యత లోపించింది. చిన్న వర్షానికి కూడా సచివాలయం చాంబర్లు మునిగిపోతున్నాయి. స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాద్ చాంబర్‌లో రాజకీయ విమర్శలు చేయడం తగదు. రాజకీయాల గురించి స్పికర్ మాట్లాడం కోడ్ ఉల్లంఘనే. దీనిపై ఈసీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి
’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment