
‘ఆశ’ నిరాశల ఊగిసలాట
సమస్యలపై ఎన్నాళ్లు పోరాడినా నిరాశే
నెలల తరబడి పారితోషికాల బకాయి
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇంతే సంగతులు
గుడ్లవల్లేరు : నిజమైన వైద్యసేవలకు దర్పణంగా నిలుస్తున్నారు ఆశలు. పల్లెల్లో పేదలకు వైద్యం అందించే ఆశ వర్కర్లు పస్తులు ఉంటున్నారు. ఇదేమిటని అడిగితే మహిళలు అని కూడా కనికరం లేకుండా పోలీసులు లాఠీలతో ఆశలను విరగకొడుతున్నారు. వెయ్యి మంది జనాభాకు ఒక ఆశ వర్కరు పని చేస్తున్నారు. వీరు ఇంటింటికీ వైద్య సేవలు అందిస్తున్నారు. నెలలు తరబడి ప్రభుత్వం పారితోషికాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తుంది. చాలీచాలని వేతనంతో నిజమైన పేదవాడి చెంతకు వైద్యసేవలు అందజేయటంలో ఆశ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వాడవాడల్లోని గడపగడపకూ తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆశ వర్కర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికాలు అందక పస్తులతో కాలం గడుపుతున్న దయనీయ స్థితిలో ఆశ కార్యకర్తలు ఉన్నారు. వీరికి ప్రభుత్వం అప్పగించిన పనులకు ఇచ్చే పారితోషికానికి పొంతన లే దు. పని భారం ఎక్కువైంది. ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటుందని బాధిత వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న బాధ్యతల భారం..
• ఇంటింటికీ తిరిగి రోగులకు ఇచ్చే మందులను ఆశాలు ఇవ్వాల్సిందే
• గర్భిణుల్ని విధిగా పీహెచ్‌సీకి తీసుకెళ్లాలి
• పల్లె ప్రజలకు జ్వరాలు వచ్చినపుడు ఇంటింటికీ మందులు ఇవ్వాలి
• క్షయ రోగుల్ని గుర్తించాలి
• కుష్టు రోగుల గుర్తింపు బాధ్యత
• బోదకాలు రోగుల్ని గుర్తించాలి
• కుటుంబ సంక్షేమ ఆపరేషనుకు ఒప్పించాల్సిన బాధ్యత
• తన పరిధిలోని గర్భిణులు పీహెచ్‌సీలో కాన్పుకు ఎన్ని రోజులైనా ఆశ వర్కరు ఉండాలి
డిమాండ్లు ఇవి...
• ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి
• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారితోషికాలు పెంచాలి
• గౌరవ వేతనం పెంచాలి
• పాత బకాయిలు చెల్లించాలి
• రూ.ఐదు లక్షల ప్రమాద బీమా అర్హత కల్పించాలి
• 104 సేవల బకాయిలు చెల్లించాలి
• రూ.300లకు పారితోషికాన్ని పెంచాలి
• మూడేళ్లగా ఇవ్వని యూనిఫామ్‌తో పాటు అలవెన్స్ చెల్లించాలి.
• అర్హులైన ఆశలకు ఏఎన్‌ఎం శిక్షణ ఇవ్వాలి. ఇప్పటికే శిక్షణ పొందిన వారిని సెకండ్ ఏఎన్‌ఎంగా తీసుకోవాలి.