తిరుపతి ప్రత్యేక సబ్ జైలు వద్ద వేచి ఉన్న ఖైదీల బంధువులు (ఫైల్)
నేరస్తులు ఎలాంటి వారైనా వారికీ బంధాలు ఉంటాయి. బంధుమిత్రులు ఉంటారు. నేరాలకు పాల్పడి అరెస్టయిన వారిని కలుసుకోవాలని వారి బంధుమిత్రులు ఆశిస్తారు. జైలులో ఉన్న రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిలను కలవాలంటే ఏం చేయాలి, ఎవరి అనుమతి తీసుకోవాలి, వారిని ఎన్నిసార్లు కలవచ్చు, ఎంత సమయం మాట్లాడవచ్చు అనే అంశాలను తిరుపతి ప్రత్యేక జైలు అధికారి వేణుగోపాల్‌రెడ్డి వివరించారు.
తిరుపతి క్రైం: అనుమతి తీసుకోవడం ఇలా..జైలులో ఉన్న వారిని కలిసేందుకు ముందుగా ఓ దరఖాస్తు పూర్తి చేయాలి. అందులో ఖైదీతోపాటు కలవడానికి వచ్చిన వారి వివరాలు, ఖైదీలతో వారికున్న బంధం, చిరునామా తెలియజేయాలి. ఏదైనా ఒక గుర్తింపు కార్డు (ఆధార్, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) ఇవ్వాలి. దరఖాస్తును జైలు సిబ్బందికి అందజేస్తే వారు ఉన్నతాధికారికి పంపిస్తారు. ఆయన దానిని పరిశీలిం చి అనుమతిని మంజూ రు చేస్తారు. ఖైదీలను సాధారణ పనిరోజుల్లో వారానికి 2 సార్లు కలవచ్చు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు కలిసే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న బంధువులు ఖైదీతో సుమారు 20 నిమిషాలు మాట్లాడవచ్చు.
ప్రభుత్వ సెలవు దినాలు, ఆదివారాల్లో కలుసుకోవడానికి అనుమతి ఇవ్వరు. ఖైదీని తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, వారి న్యాయవాదులు కలిసేందుకు అవకాశం ఉంటుంది. ఖైదీలను కలవడానికి వచ్చేవారు గతంలో పండ్లు, కవర్ ప్యాకింగ్‌తో ఉన్న బిస్కెట్లు, స్వీట్లు అందించే అవకాశం ఉండేది. ప్రస్తుతం దీన్ని పూర్తిగా నిషేధించారు. ఇప్పుడు దుస్తులు, దుప్పట్లు మాత్రమే ఇవ్వవచ్చు. డాక్టర్ పరిశీలిస్తే సూపరింటెండెంట్ అనుమతితో మందులను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ముందుగా వీటిని జైలు సిబ్బంది పరిశీలించి తరువాత ఖైదీలకు అందిస్తారు. ఖైదీలకు డబ్బులు ఇవ్వాలనుకుంటే నేరుగా ఖైదీలకు ఇవ్వరాదు. వారు ఇవ్వాలనుకున్న డబ్బును జైలు సిబ్బందికి ఇస్తే ప్రిజనర్స్ ప్రైవేట్ క్యాష్(పీపీసీ)లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది.
ఫోన్ ద్వారా సంభాషణ
జైలులో ఉన్న ఖైదీలకు ఫోన్ సదుపాయం కల్పిస్తారు. కాల్‌కు 5 నిమిషాలకు రూ.10 వసూలు చేస్తారు. ఫోన్ మాట్లాడే సమయంలో వారు మాట్లాడే మాటలన్నీ జైలు సూపరింటెండెంట్ కార్యాలయంలో రికార్డు అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఖైదీలు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి. నెలకు 2 సార్లు ఫోన్ చేసుకోవచ్చు. 15 రోజులకొకసారి ఖైదీలకు ఉత్తరం రాసుకునే అవకాశం కల్పిస్తారు.
సిబ్బంది ఎదుటే మాట్లాడాలి
సిబ్బంది పర్యవేక్షణలోనే ఖైదీలతో సంబంధించిన వ్యక్తులతో మాట్లాడిస్తాం. ఖైదీల కోసం తీసుకొచ్చిన పండ్లు, బిస్కెట్లు గతంలో అనుమతిస్తున్నాము. ప్రస్తుతం భద్రత కోసం ఖైదీలకు ఎటువంటి తినుబండారాలు కానీ, క్యారీయర్ కానీ తెచ్చివ్వకూడదు. ఏదైనా మాట్లాడాలన్నా కూడా మా ముందే మాట్లాడాలి. –వేణుగోపాల్‌రెడ్డి,తిరుపతి ప్రత్యేక జైలు అధికారి
Comments
Please login to add a commentAdd a comment