ఎండుతున్న నారుమళ్లు
వర్షం కోసం రైతన్నల ఎదురుచూపు
సగం కూడా పూర్తికాని వరినాట్లు
జోరుగా వానలు కురవాల్సిన సమయంలో ఎండలు మండిపోతున్నాయి. మెట్ట, సెమీ డెల్టా ప్రాంతాల్లో నారుమడులు ఎండిపోతున్నాయి. వరుణుడి కరుణ కోసం ఎదురుచూసి అన్నదాతల గుండెలవిసిపోతున్నాయి. జూలై నెలాఖరు నాటికే నాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించగా.. కనీసం డెల్టాలోనూ 40 శాతం ఆయకట్టులో కూడా నాట్లు పడలేదు. సార్వా సాగును ఎలా గట్టెక్కించాలో తెలియక కర్షకులు కలవరపడుతున్నారు.
ఏలూరు (టూ టౌన్) : వర్షాభావ పరిస్థితులు జిల్లా రైతులను కుంగదీస్తున్నాయి. ఓ వైపు నారుమడులు ఎండిపోతుండగా.. మరోవైపు నాట్లు బాగా ఆలస్యమవుతున్నాయి. సార్వాలో 2.60 లక్షల హెక్టార్లలో వరి పండించేందుకు సన్నద్ధమైన అన్నదాతలు నారుమళ్లు పోశారు. సకాలంలో కాలువలకు నీరు విడుదల చేసినా శివారు ప్రాంతాలకు చేరలేదు. మరోవైపు కృష్ణా డెల్టాకు కాలువ నీరు అందలేదు. మెట్టలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ పరిస్థితుల్లో నారుమడులు ఎండిపోతుండగా.. నాట్లు పడటం లేదు. పుష్కలంగా నీరు లభించే డెల్టాలోనూ ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ కింద 1.72 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు సుమారు 60 వేల హెక్టార్లలో మాత్రమే వరినాట్లు పడ్డాయి.
జిల్లా మొత్తంగా చూస్తే 2.60 లక్షల హెక్టార్లలో నాట్లు పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1.24 హెక్టార్లలో మాత్రమే వేశారు. పూర్తిస్థాయిలో వర్షాలు కురవకపోతే సుమారు 75 వేల హెక్టార్లల్లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది. కృష్ణా డెల్టాకు విషయానికి వస్తే కృష్ణా కాలువలో నీరు లేకపోవడంతో ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలాల రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జూలై రెండో వారంలోనే కృష్ణా కాలువకు నీరివ్వాల్సి ఉండగా, ఇప్పటివరకూ చుక్కు నీరు కూడా రాలేదు. దీంతో ఆ ఆయకట్టు పరిధిలో వేసిన నారుమడులు నీరందక ఎండిపోతున్నాయి. ఇక్కడ నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. మెట్ట ప్రాంతంలో వర్షాలు పడక రైతులు తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నారుమళ్లు పోసిన రైతులు దుక్కులు చేసేందుకు నీరు లేకపోవడంతో దిక్కులు చూస్తున్నారు.
విత్తనాలను వెదజల్లండి
తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులు చేలల్లో నేరుగా విత్తనాలను వెదజల్లే పద్ధతిలో సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. నారుమళ్లు ముదిరిపోతున్న నేపథ్యంలో అందుకు ప్రత్యామ్నాయంగా వెదజల్లే పద్ధతి అనుసరించాలని పేర్కొంటున్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచినట్టు చెబుతున్నారు.
సాగు.. ఎలాగు !
Published Sat, Aug 1 2015 2:58 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM
Advertisement