అరకులోయ/గొలుగొండ: నిన్నామొన్నటి వరకు చినుకు జాడలేక అల్లాడిన పైరులన్నీ మూడ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కళకళలాడుతున్నాయి. తీవ్రమైన ఎండలతో ఎండిపోయిన అవి మళ్లీ జీవం పోసుకున్నాయి. మన్యంలో మునుపెన్నడూ లేనివిధంగా గిరి రైతులు సామ విస్తారంగా సాగుచేశారు. రెండేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణాలతో వివిధ రకాల పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయినవారు ఈసారి ప్రత్యామ్నాయంగా సామపై దృష్టి పెట్టారు.
ఖరీఫ్ వరిపంట చేతికందే వరకూ సామలే వారికి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. మార్కెట్‌లో కిలో సామలు ధర రూ. 15 నుంచి రూ. 20 వరకు ఉంది. ఈ ఏడాది ఒక అరకులోయ మండలంలోనే సు మారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సామ సాగు అవుతోందని వ్యవసాయ శాఖ అధికారు లు చెబుతున్నారు. అయితే తొలుత విత్తనాలు వేసినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షం లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇప్పుడు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడటంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే ఇటీవలి ఎండలకు గొలుగొండ మండలంలో మొక్కజొన్న, చెరకు, కూరగాయల పంటలకు తీవ్రమైన నష్టం కలిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేసిన చెరకు నాట్లు అయితే మొలకె త్తిన పరిస్థితి లేదు. మేలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు మండలంలో 200 ఎకరాలుకుపైగా మొక్కజొన్న సాగు చేపట్టారు. అదీ ఎండలకు బాగా వాడిపోయింది.
పెట్టుబడులన్నీ పోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో వర్షం ఊరటనిచ్చింది. అలాగే ఏటిగైరంపేట, రావణాపల్లి, పుత్రగైరంపేట ప్రాంతాల్లో రైతులు వరి నారుమడులు సిద్ధం చేసుకొనే పనుల్లో నిమగ్నమవుతున్నారు.
పైరుకు ప్రాణం పోసిన వరుణుడు
Published Thu, Jul 10 2014 1:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement