కాంగ్రెస్ ఓటమిపై ఆంటోనీ కమిటీకి తెలంగాణ, ఏపీ నేతల నివేదికలు
న్యూఢిల్లీ: సార్వత్రిక, శాసనసభ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఓటమిపై లోతుగా విశ్లేషించుకునే పనిలో పడింది. దేశవ్యాప్తంగా ఓటమికి దారితీసిన పరిస్థితులు, పార్టీ భవిష్య నిర్మాణంపై సమీక్ష జరిపేందుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన ఎ.కె.ఆంటోనీ కమిటీ గత నెల 26వ తేదీ నుంచి రాష్ట్రాల వారీగా సమీక్షా సమావేశాలు జరుపుతోంది. దీనిలో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాల నేతలతో ఇక్కడి వార్ రూమ్‌లో ఈ కమిటీ సమావేశమైంది. ఆంటోనీతోపాటు కమిటీలో ఉన్న ముకుల్‌వాస్నిక్, అవినాశ్‌పాండే, రామచంద్ర కుంతియా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఓటమిపై తన నివేదికను అందజేశారు. అనంతరం తెలంగాణ నేతలు ఒక్కొక్కరితో విడివిడిగా అభిప్రాయాలు తెలుసుకున్నారు.
తెలంగాణ నుంచి మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డిలు ఈ సమావేశానికి హాజరై విడివిడిగా నివేదికలు ఇచ్చారు. కమిటీతో ఎస్.జైపాల్‌రెడ్డి 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించడంలో టీఆర్‌ఎస్ విజయవంతమైందని భావించిన ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారని నివేదికలో పొన్నాల పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన చేసిన తీరు, దానికి ఇతర పార్టీలు మద్దతిచ్చినా కాంగ్రెస్‌ను దోషిగా చిత్రీకరించడం, ప్రభుత్వ వ్యతిరేకత వంటి కారణాలవల్ల పార్టీ ఓడిపోయిందని ఆంధ్రప్రదేశ్ నేతలు నివేదికలు ఇచ్చారు.
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు
Published Thu, Jul 3 2014 12:52 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement