ఆశలన్నీ కేంద్రంపైనే !
సాక్షి ప్రతినిధి,విజయనగరం : హుద్‌హుద్ జిల్లాలో పెను విధ్వంసం సృష్టించింది. పెనుగాలులతో విరుచుకుపడింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కుప్ప కూలి పోయాయి. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. గాలుల బీభత్సానికి 14మంది మరణించారు. వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి. వేలాది ఇళ్లు కూలి పోయాయి. తుపాను బీభత్సం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జిల్లాకు అపారనష్టం వాటిల్లింది. ప్రతి ఒక్కరికీ ఏదొక రూపంలో నష్టం జరిగింది. ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. పంటలు నాశనమయ్యాయి. ఉద్యానవన పంటలు నేలమట్టమయ్యాయి. ఆదుకోవడంలో రాష్ట్రప్రభుత్వం చేతులేత్తేసింది. అరకొరగా నిత్యావసర సరుకులిచ్చి చేతులు దులుపుకొంది. తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేపట్టేందుకే నెల రోజు లు పట్టింది. శాశ్వత పునరుద్ధరణ పనుల ఊసేలేదు. పరిహారం, పునరావాసం జోలికే పోలేదు.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. దీంతో బుధవారం జిల్లాకొస్తున్న కేంద్ర బృందంపైనే జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ బృందం భోగాపురం, పూసపాటిరేగ,డెంకాడ పర్యటించనుంది. విజయనగరం పట్టణంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, వినతులు స్వీకరిస్తుంది. కరువు బృందాలు మాదిరి గా వచ్చి వెళ్లామని కాకుండా బాధితుల ఆక్రందనను అర్థం చేసుకుని వాస్తవ పరిస్థితులను గుర్తించాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.2.200కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తిం చారు. మరీ, జిల్లాకొస్తున్న కేంద్ర బృందం సభ్యులు ఏమేరకు లెక్క కడతారో చూడాలి. అయితే తుపాను తీరం దాటిన 45 రోజుల తరువాత బృందం రావడంపై జిల్లా వాసులు కొద్దిపాటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడొస్తే నష్టాలను ఎలా పరిశీలించగలరని ప్రశ్నిస్తున్నారు.
పర్యటన వివరాలు
ఉదయం 9.15గంటలకు విజయనగరం జిల్లాలోకి ప్రవేశిస్తారు.
ఉదయం 9.45గంటలకు... భోగాపురం మండలం కవులవాడలో జరిగి నకొబ్బరిపంట నష్టాన్ని పరిశీలిస్తారు.
ఉదయం 10.10గంటలకు... భోగాపురం మండలం తూడెం గ్రామంలో నేలమట్టమైన కొబ్బరితోటతో పాటు దెబ్బతిన్న ట్రాన్స్‌కో ఆస్తులను పరిశీలిస్తారు. అనంతరం బాధితులతో మమేకమవుతారు.
ఉదయం 10.45గంటలకు... భోగాపురం మండలం దిబ్బపాలెం గ్రామంలో ధ్వంసమైన జీడితోటను పరిశీలిస్తారు. అలాగే, నేలమట్టమైన కొబ్బరిని, దెబ్బతిన్న ట్రాన్స్‌కో ఆస్తులను పరిశీలిస్తారు. ఇక్కడే నష్టాలపై ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షిస్తారు.
ఉదయం 11.15గంటలకు... భోగాపురం మండలం ముక్కాంలో బాధిత మత్స్యకారులు, ఫౌల్ట్రీ రైతులతో మమేకమవుతారు. దెబ్బతిన్న మత్స్యశాఖ, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్‌శాఖ ఆస్తులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన నష్టాల ఎగ్జిబిషన్‌ను వీక్షిస్తారు.
ఉదయం 11.45గంటలకు... భోగాపురంలో పత్తి సాగుచేస్తున్న పొలాల ను,దెబ్బతిన్న తాగునీటిసరఫరా పైపు లైన్లు పరిశీలిస్తారు. పశు సంపద నష్టపోయినరైతులతో మమేకమవుతారు.
మధ్యాహ్నం 12.15గంటలకు... డెంకాడ మండలం నాతవలసలో దెబ్బతిన్న సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 1.30గంటల నుంచి 3గంటల వరకు జిల్లాకేంద్రంలోని జెడ్పీ సమావేశం హాల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులు, ఇతర అధికారుల విజ్ఞాపనలు వింటారు.
సాయంత్రం 3.45గంటలకు... పూసపాటిరేగ మండలం తిప్పలవల సలో పర్యటించి దెబ్బ తిన్న మత్స్య కార ఆస్తులను పరిశీలిస్తారు. అనంతరం బాధితులతో మమేకమవుతారు.
సాయంత్రం 4.25గంటలకు.... పూసపాటిరేగ మండలం కుమిలిలో దెబ్బతిన్న వరి, చెరకు పంటను పరి శీలిస్తారు. బాధిత రైతులతో కూడా మమేకమవుతారు. అనంతరం పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్ శాఖలకు సంబంధించి దెబ్బతిన్న ఆస్తులను పరిశీలిస్తారు.