పైరవీలు షురూ !
ప్రభుత్వం అధికారుల బదిలీలకు పచ్చజెండా ఊపడంతో టీడీపీ నేతలు జోరుమీదున్నారు. తమకు నచ్చిన, అనుకూలంగా ఉన్న వాళ్లను తెచ్చుకోవచ్చని, తమకు వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో పని చేసిన వారిని ఇక్కడ నుంచి పంపించి వేయవచ్చని భావిస్తున్నారు. పనిలో పనిగా ఉద్యోగుల అవసరాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. పైరవీల దందా మొదలుపెట్టేశారు. మరో పక్క ఉద్యోగుల్లో కొంతమందికి సంతోషంగా ఉన్నా...ఎక్కువ శాతం మందికి బదిలీల వ్యవహారం మింగుడుపడడం లేదు. బదిలీల నిలుపుదల కోసం ఇప్పటికే చాలామంది అధికార పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొందరు బదిలీలు ఆపుకొనేందుకు లక్షలాది రూపాయలు ముట్టజెప్పడానికి కూడా వెనుకాడడం లేదు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం, విజయనగరం ఫోర్ట్ : మంచినీటి పథకాల నిర్వహణ పనులు, అంగన్‌వాడీ సరుకుల సబ్ కాంట్రా క్ట్‌లు, పారిశుద్ధ్య కాంట్రాక్ట్‌లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు, బీఆర్‌జీఎఫ్ వర్కులు,.ఇలా అన్నింటిలో తలదూర్చుతున్న టీడీపీ నాయకులకు మరో అవకాశం వచ్చింది. ఇదే అదునుగా వేరే ప్రాంతాల్లో పని చేస్తున్న తమ బంధుగణాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిద్దరైతే మంత్రుల ద్వారా చెప్పిస్తున్నారు. ముఖ్యంగా డీఆర్‌డీఎ, డ్వామా, జిల్లా పరిషత్, వైద్య విధాన పరిషత్‌కు, పంచాయతీ రాజ్ శాఖలకు తమ సన్నిహితంగా, బంధుత్వం ఉన్న అధికారులను రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మండలస్థాయి అధికారులపైనే గురి...
జిల్లా స్థాయి అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల విషయాన్ని పక్కన పెడితే తహశీల్దార్, ఎంపీడీఓలు, మినిస్టీరియల్ ఉద్యోగాల బదిలీలతో తమ జేబులు నింపు కోవాలని ప్రయత్నిస్తున్నారు. మండల స్థాయిలో ఇప్పటికే బేరసారాలు జోరందుకున్నాయి. సిఫారసు లేఖలు అటు రెవెన్యూకు, ఇటు జిల్లా పరిషత్‌కు చేరాయి. అలాగే పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ తదితర ఇంజినీరింగ్ శాఖల్లో కూడా బదిలీల కోసం పెద్ద ఎత్తున ఒప్పందాలు జరుగుతున్నాయి. జేఈ,డీఈఈ స్థానాలకు పోటీ నెలకొనడంతో లక్షల్లో రేటు పలుకుతోంది.
ఐదేళ్లుగా సీటు వదలని ఉద్యోగులు...
వైద్య విధాన్ పరిషత్‌లో ఏళ్ల తరబడి ఉద్యోగులు ఒకేచోట పని చేస్తున్నారు. జిల్లాలో కేంద్రాస్పత్రి, ఘోషా ఆస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, గజపతినగరం, భోగాపురం, బాడంగి, ఎస్. కోట మండలాల్లో వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులున్నారుు. వీటిల్లో 350 మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో 100 మంది వరకు ఐదేళ్లకుపైగా పని చేస్తున్నారు. మరికొందరు పది, ఇర వై ఏళ్లకు పైబడి కూడా పని చేస్తున్నారు.
అలాగే జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో కూడా చాలా మంది మూడేళ్లకు పైగా పని చేస్తున్నారు. జిల్లాలో జరిగే ప్రతి అభివృద్ధి పని ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుండడంతో ఈ రెండు శాఖల్లో పని చేసే సిబ్బం దికి చేతినిండా పని ఉంటుంది. అలాగే చేతి నిండా సంపాదన కూడా ఉంటుందన్న ఆరోపణలు ఉన్నారుు. జిల్లా కేంద్రంలో ఉద్యో గంతో పాటు అన్ని వసతులు ఉండడంతో ఉద్యోగులు ఇక్కడి నుంచి వేరే చోటకు బదిలీపై వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఏదోలా ఇక్కడే ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ...
వస్తున్నారు. అయితే బదిలీల జీవో జారీ చేయడంతో ఈసారి స్థానచలనం తప్పదేమోనని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా వైద్య విధాన్ పరిషత్ ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో ఐదేళ్లకు మించి ఒకేచోట పని చేసిన వారు అధికంగా ఉన్నారు. వీరు ఆందోళన నెలకొంది. బదిలీ తప్పనిసరి అయితే త మ క్లీనిక్‌ల పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. బదిలీల నిలుపుదలకు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల చు ట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులు ఆ పార్టీ నాయకులకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా జిల్లా అధికారులకు కూడా పెద్ద ఎత్తున బదిలీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
ఉరుకులు...పరుగులు
బది లీల ప్రక్రియకు కేవలం నెల రోజులు మాత్రమే ప్రభుత్వం గడువు ఇవ్వడంతో అటు అధికారులు ఇటు నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అధికారులు మంచి పోస్టింగ్‌ల కోసం, కావల్సిన ప్రాంతాల కోసం ఆరాటపడుతుండడంతో వారి అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు నేతలు బేరాసారాలు చేస్తున్నారు. మొత్తానికి బదిలీల పుణ్యమా అని అధికార పార్టీ నేతలకు కాసులు కురుస్తున్నాయి.