లెవీ సేకరణలో కోత!
విజయనగరం కంటోన్మెంట్:పౌర సరఫరాల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లెవీ సేకరణను తగ్గించే ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు మిల్లర్లు సేకరిస్తున్న బియ్యంలో 75 శాతం లెవీకి అప్పగించి.. మిగతా 25 శాతం బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం... ఇకపై మిల్లర్లు సేకరించే బియ్యంలో 25 శాతం మాత్రమే లెవీకి ఇచ్చి, మిగతా 75 శాతం వారు బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకోచ్చు. దీని వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు మిల్లర్లు 25 శాతం లేవీ మాత్రమే సేక రించి, మిగతా దాని గురించి పట్టించుకోరు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర 25 శాతం తరువాత మరి ఇచ్చే పరిస్థితి ఉం డదు. ఇప్పటివరకు సివిల్ సప్లయ్, లేదా ఎఫ్‌సీఐ బియ్యాన్ని మిల్లర్లు నుంచి కిలో 26 రూపాయల చొప్పున కొనుగోలు చేసి, కిలో రూపాయి చొప్పన రేషన్ డిపోల ద్వారా పేదలకు అందజేస్తోంది.
అయితే ఈ రూపాయిలో రేషన్ డిపో డీలర్‌కు 20పైసలు కమీషన్‌గా చెల్లిస్తోంది. దీంతో కిలో బియ్యంవద్ద కేవలం 80 పైసలు మాత్రమే ప్రభుత్వానికి లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరతోనే లెవీ సేకరణ శాతం ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు రైతులు తేలికపాటి రకాలైన వరి వంగడాలనే సాగు చేసి విక్రయిస్తున్నారు. ఇతర రకాలకు ఈ ప్రాంత భూములు అనుకూలంగా ఉండవు. కేంద్ర ప్రభుత్వ నూతన విధానం వల్ల రైతులు సాగు చేసిన తేలికపాటి పంటను మిల్లర్లు కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకురారు. మద్దతు ధర కూడా కొంతవరకే ఉంటుంది. దళారులు, వ్యాపారులు సిండికేట్ అయి తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు.
దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమా దం ఉంది. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న మసూరి, సోనా మసూరి, సాంబమసూరి వంటి రకాలను రైతులు ఎప్పటి నుంచో పం డించడం మానేశారు. ఇప్పుడు ఉన్న వర్షాభావ పరిస్థితులు, పెరిగిన పెట్టుబడులతో కేవలం తేలిక రకాలైన 1001,1010 వరి వంగడాలను మాత్రమే సాగు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం రేషన్ భారాన్ని మోయలేమని కేవలం 25 శాతం మాత్రమే తీసుకుంటామని చెబుతుండడంతో మిల్లర్లు 25 శాతం కొనుగోలు చేసి చేతులెత్తేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాగా ప్రస్తుతం జిల్లాకు ప్రతి నెలా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతున్నాయి. ఈ లెక్కన ఏడాదికి లక్షా 32 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 15 ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 25 శాతమే తీసుకుంటామని చెప్పడంతో ఈ భారం రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా పడుతుంది. 26 రూపాయల లెక్కన మిగతా 50 శాతం బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం కష్టమే.