Hudhud cyclone victims
-
ఇళ్లు కాదు కన్నీళ్లు
హుద్‌హుద్ బాధితుల్లో కొందరికే ఆవాసం 66,390 ఐఏవై ఇళ్లకు ప్రతిపాదనలు 15,219 మంజూరు చేసిన కేంద్రం జన్మభూమి కమిటీలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత సాక్షి, విశాఖపట్నం : హుద్‌హుద్ తుఫాన్ బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం రాష్ర్ట ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల్లో నాలుగో వంతుకు మాత్రమే కేంద్రం ఆమోద ముద్ర వేసింది. విశాఖ జిల్లాకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 66,390 ఐఏవై ఇళ్లు మంజూరు చేయాలని కోరగా 15,219 ఇళ్లను మాత్రమే మంజూరుచేసింది. వీటి కోసం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జన్మభూమి కమిటీల చేతుల్లో పెడుతున్నారు. గతేడాది అక్టోబర్ 12వ తేదీన విరుచుకుబడిన హుద్‌హుద్ తుఫాన్ దాటికి ఒక్క విశాఖ జిల్లాలోనే లక్షా 18 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. కనీసం మరమ్మతులు కూడా చేయించుకునే స్తోమత లేని వందలాది మంది ఇంకా మొండి గోడలు, కూలిన పూరిగుడెసల మధ్యే జీవనం సాగిస్త్తున్నారు. తుఫాన్ వచ్చి ఎనిమిది నెలలు గడిచినా ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు నిర్మించిన పాపాన పోలేదు. గ్రామీణ ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణానికి కేంద్ర సాయం కోసం ఎదురుచూపులే తప్ప రాష్ర్టం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. ఐఐవై కింద జిల్లాకు కనీసం 63,390 ఇళ్లు మంజూరు చేయాలంటూ రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఐఏవై కింద ఏ జిల్లాకైనా ఏటా ఐదు నుంచి 10 వేల ఇళ్లలోపు మాత్రమే కేంద్రం మంజూరు చేస్తుంటుంది. కనీవినీ ఎరుగని తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టంజరిగినందున పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా కనీసం ఐదేళ్ల పాటు మంజూరు చేసే ఇళ్లను ఒకేసారి మంజూరుచేయాలని కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం మాత్రం 15,219 ఇళ్లను మంజూరు చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 8837 ఇళ్లను మంజూరు చేయగా, 2014-15లో 7015 మంజూరు చేశారు. గతేడాది మంజూరైన ఇళ్లల్లో 3002 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇక ఈ ఏడాది హుద్‌హుద్ నేపథ్యంలో ఐఏవై కింద జిల్లాకు అత్యధిక కేటాయింపులు జరిపింది. విశాఖ గ్రామీణ జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలోని 39 మండలాల్లో హుద్‌హుద్‌కు దెబ్బతిన్న లబ్ధిదారులకు వీటిని కేటాయించనున్నారు. మిగిలిన సంక్షేమ పథకాల మాదిరిగానే వీటిని కూడా జన్మభూమి కమిటీలకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే దాతల సహకారంతో ఉత్తరాంధ్ర పరిధిలోని మూడు జిల్లాలకు రూ.560 కోట్లతో 10వేల ఇళ్ల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేయగా, వాటిలో ఆరు వేలు విశాఖ జిల్లాలోనే నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు గత నెల 28న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాల్సి ఉండగా వాయిదాపడిన విషయం విధితమే. -
హుద్‌హుద్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
నెల్లిమర్ల: ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాను బాధితులను వైఎస్సార్‌ఫౌండేషన్ ద్వారా అన్నివిధాలా ఆదుకున్నామని వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. తుఫాన్‌వల్ల చనిపోయిన 14మంది కుటుంబాలకు రూ.50వేలు చొప్పున వైఎస్సార్‌ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. మండలంలోని దన్నానపేట గ్రామానికి చెందిన పంతగడ ప్రతాప్ అనేవ్యక్తి హుద్‌హుద్ తుఫాన్ సమయంలో స్థానిక చెరువు దాటుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతాప్ భార్య వెంకటదుర్గకు వైఎస్సార్ ఫౌండేషన్ తరఫున పెనుమత్స సాబంశివ రాజు శుక్రవారం రూ.50వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీరప్రాంతాలకు చెందిన కుటుంబాలకు వైఎస్సార్ ఫౌండేషన్‌ద్వారా బియ్యం, వస్త్రాలు అందజేశామని చెప్పారు. అయితే ప్రభుత్వం తరఫున బాధితులకు అందాల్సిన సాయం ఇప్పటిదాకా పూరిస్థాయిలో అందలేదని ఆరోపించారు. జిల్లాలో లక్షలాదిమంది రైతులు పంటలు నాశనమై తీవ్రంగా నష్టపోయారన్నారు. అయితే ఇప్పటిదాకా రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోలేదన్నారు. రైతుసాధికార సదస్సుల ద్వారా కేవలం ఒక్కోగ్రామానికి ఒకరిద్దరే రైతులను మాత్రమే ఎంపికచేసి చేతులు దులుపుకొందని ఆరోపించారు. టేకు, మామిడి, కూరగాయలు తదితర పంటలు కోల్పోయిన రైతుల జాబితాలను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిం చారు. నష్టపరిహారం అందకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హుద్‌హుద్‌వల్ల నష్టపోయిన రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యు డు గదల సన్యాసినాయుడు, రైతువిభాగం కన్వీనర్ సింగుబాబు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనమల్లు వెంటకరమణ, మాజీ ఏఎంసీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములునాయుడు, పార్టీనేతలు జానా ప్రసా ద్, రేగాన శ్రీనివాసరావు, తర్లాడ దుర్గారావు, మహంతి రామారావు, మీసాల నారాయణరావు, తులసి పాల్గొన్నారు. -
సీఎం సహాయ నిధికి మలబార్ గోల్డ్ రూ.13 లక్షలు
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.13 లక్షల విరాళం ఇచ్చింది. వైజాగ్ హుద్‌హుద్ తుఫాన్ బాధితుల సహాయార్థం ఈ విరాళమిచ్చామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆశలన్నీ కేంద్రంపైనే !
సాక్షి ప్రతినిధి,విజయనగరం : హుద్‌హుద్ జిల్లాలో పెను విధ్వంసం సృష్టించింది. పెనుగాలులతో విరుచుకుపడింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కుప్ప కూలి పోయాయి. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. గాలుల బీభత్సానికి 14మంది మరణించారు. వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి. వేలాది ఇళ్లు కూలి పోయాయి. తుపాను బీభత్సం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జిల్లాకు అపారనష్టం వాటిల్లింది. ప్రతి ఒక్కరికీ ఏదొక రూపంలో నష్టం జరిగింది. ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. పంటలు నాశనమయ్యాయి. ఉద్యానవన పంటలు నేలమట్టమయ్యాయి. ఆదుకోవడంలో రాష్ట్రప్రభుత్వం చేతులేత్తేసింది. అరకొరగా నిత్యావసర సరుకులిచ్చి చేతులు దులుపుకొంది. తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేపట్టేందుకే నెల రోజు లు పట్టింది. శాశ్వత పునరుద్ధరణ పనుల ఊసేలేదు. పరిహారం, పునరావాసం జోలికే పోలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. దీంతో బుధవారం జిల్లాకొస్తున్న కేంద్ర బృందంపైనే జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ బృందం భోగాపురం, పూసపాటిరేగ,డెంకాడ పర్యటించనుంది. విజయనగరం పట్టణంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, వినతులు స్వీకరిస్తుంది. కరువు బృందాలు మాదిరి గా వచ్చి వెళ్లామని కాకుండా బాధితుల ఆక్రందనను అర్థం చేసుకుని వాస్తవ పరిస్థితులను గుర్తించాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.2.200కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తిం చారు. మరీ, జిల్లాకొస్తున్న కేంద్ర బృందం సభ్యులు ఏమేరకు లెక్క కడతారో చూడాలి. అయితే తుపాను తీరం దాటిన 45 రోజుల తరువాత బృందం రావడంపై జిల్లా వాసులు కొద్దిపాటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడొస్తే నష్టాలను ఎలా పరిశీలించగలరని ప్రశ్నిస్తున్నారు. పర్యటన వివరాలు ఉదయం 9.15గంటలకు విజయనగరం జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఉదయం 9.45గంటలకు... భోగాపురం మండలం కవులవాడలో జరిగి నకొబ్బరిపంట నష్టాన్ని పరిశీలిస్తారు. ఉదయం 10.10గంటలకు... భోగాపురం మండలం తూడెం గ్రామంలో నేలమట్టమైన కొబ్బరితోటతో పాటు దెబ్బతిన్న ట్రాన్స్‌కో ఆస్తులను పరిశీలిస్తారు. అనంతరం బాధితులతో మమేకమవుతారు. ఉదయం 10.45గంటలకు... భోగాపురం మండలం దిబ్బపాలెం గ్రామంలో ధ్వంసమైన జీడితోటను పరిశీలిస్తారు. అలాగే, నేలమట్టమైన కొబ్బరిని, దెబ్బతిన్న ట్రాన్స్‌కో ఆస్తులను పరిశీలిస్తారు. ఇక్కడే నష్టాలపై ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షిస్తారు. ఉదయం 11.15గంటలకు... భోగాపురం మండలం ముక్కాంలో బాధిత మత్స్యకారులు, ఫౌల్ట్రీ రైతులతో మమేకమవుతారు. దెబ్బతిన్న మత్స్యశాఖ, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్‌శాఖ ఆస్తులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన నష్టాల ఎగ్జిబిషన్‌ను వీక్షిస్తారు. ఉదయం 11.45గంటలకు... భోగాపురంలో పత్తి సాగుచేస్తున్న పొలాల ను,దెబ్బతిన్న తాగునీటిసరఫరా పైపు లైన్లు పరిశీలిస్తారు. పశు సంపద నష్టపోయినరైతులతో మమేకమవుతారు. మధ్యాహ్నం 12.15గంటలకు... డెంకాడ మండలం నాతవలసలో దెబ్బతిన్న సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1.30గంటల నుంచి 3గంటల వరకు జిల్లాకేంద్రంలోని జెడ్పీ సమావేశం హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులు, ఇతర అధికారుల విజ్ఞాపనలు వింటారు. సాయంత్రం 3.45గంటలకు... పూసపాటిరేగ మండలం తిప్పలవల సలో పర్యటించి దెబ్బ తిన్న మత్స్య కార ఆస్తులను పరిశీలిస్తారు. అనంతరం బాధితులతో మమేకమవుతారు. సాయంత్రం 4.25గంటలకు.... పూసపాటిరేగ మండలం కుమిలిలో దెబ్బతిన్న వరి, చెరకు పంటను పరి శీలిస్తారు. బాధిత రైతులతో కూడా మమేకమవుతారు. అనంతరం పంచాయతీరాజ్, ఆర్అండ్బి, ఇరిగేషన్ శాఖలకు సంబంధించి దెబ్బతిన్న ఆస్తులను పరిశీలిస్తారు. -
సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా!
-
ఇరు రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయం * జగన్ అధ్యక్షతన సమావేశం * రెండు రాష్ట్రాల సమస్యలనూ పార్లమెంటులో ప్రస్తావించాలని నిర్ణయం * ‘హుద్‌హుద్’ బాధితులకు కేంద్రం నుంచి ఇతోధిక సాయం కోరతాం * ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదాకు డిమాండ్ * రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు కృషి * పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజల సమస్యలను వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించి, వాటి పరి ష్కారానికి కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శనివారం ఆయన నివాసంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి (నెల్లూరు), ఎంపీలు వి.వరప్రసాద్‌రావు (తిరుపతి), బుట్టా రేణుక (కర్నూలు), పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి (రాజంపేట), వైఎస్ అవినాష్‌రెడ్డి (కడప), వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(ఖమ్మం) సమావేశానికి హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలపై చర్చించారు. అనంతరం మేకపాటి రాజ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రను కుది పేసిన హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి ఇతోధిక సాయం అందించాలని కేం ద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు. తు పానులో సర్వం కోల్పోయిన వారికి సాయమందించాలని కేంద్రంలోని వివిధ శాఖలను కోరతామన్నారు. ఇందుకోసం పార్లమెంటు సమావేశాల సమయంలో వ్యవసాయ మంత్రితో పాటు పలువురు మంత్రులను, అధికారులను కలసి చర్చిస్తామన్నారు. తెలంగాణకు కీలకమైన ‘ప్రాణహిత - చేవెళ్ల’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కూడా డిమాండ్ చేయాలని నిర్ణయించామన్నారు. రైల్వే శాఖలో పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు కూడా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందిన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ హోదా ఇవ్వడంలో జరుగుతున్న జాప్యాన్ని కూడా పార్లమెంటులో కేంద్రం దృష్టికి తె స్తామని చెప్పారు. ఎస్పీవై, గీతపై అనర్హత వేటు వేయాల్సిందే లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి గీతను అనర్హులుగా ప్రకటించాలని మేకపా టి డిమాండ్ చేశారు. గెలిచిన 4 రోజులకే ఎస్పీవై రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలసి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారని, ఆయనపై ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎస్పీవై రెడ్డిపై చర్య తీసుకునే అంశం పార్లమెంటు ప్రివిలేజెస్ కమిటీ ముందుందని, ఆ కమిటీ చైర్మన్ అహ్లూవాలియాను కలసి దీనిపై చర్చిస్తామని తెలిపారు. టీడీపీలో చేరానని, అనర్హతకు గురైతే మళ్లీ పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందుతానని ఆనాడు చెప్పిన ఎస్పీవై రెడ్డి ఇప్పుడేమో వైఎస్సార్సీపీని వదిలి వెళ్లలేదని చెబుతూ అనర్హత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. కొత్తపల్లి గీత పార్టీ నుంచి వెళ్లి పోవడమే కాక , చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారన్నారు. ఆమె విజయవాడలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కూడా హాజరయ్యారన్నారు. గీత విషయాన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లో స్పీకర్ దృష్టికి తీసుకెళతామన్నారు. ఒక పార్టీ తరఫున ఎన్నికై మరో పార్టీలోకి వెళ్లిన వారిని అన ర్హులుగా ప్రకటించాలని, లేకుంటే పార్లమెంటులో చేసిన ఫిరాయింపు నిరోధక చట్టానికి విలువే లేకుండా పోతుందని మేకపాటి అభిప్రాయపడ్డారు. ఆ ఏడు మండలాలను ఆదుకోవాలి పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఏపీలో కలిపినా అక్కడి ప్రజల ఆలనా, పాలనను రెండు ప్రభుత్వాలూ పట్టించుకోవడంలేదని, ఆ మండలాల ప్రజలకు మంచి జరిగేలా పార్లమెంటులో పోరాడుతామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజల సమస్యలపై ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉండి పార్లమెంటులో లేవనెత్తాలని పార్టీ అధ్యక్షుడు జగన్ తమను ఆదేశించారని వివరించారు. -
హుదూద్ బాధితులకు కువాయిత్ వైఎస్సార్సీపీ విరాళం రూ. 4.7 లక్షలు
హైదరాబాద్ : హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం కువాయిత్‌లోని వైఎస్సార్సీపీ (గల్ఫ్) విభాగం తరపున రు.4.7 లక్షల రూపాయల విరాళాన్ని వైఎస్సార్ ఫౌండేషన్‌కు ఇచ్చారు. శనివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని గల్ఫ్ విభాగం కోఆర్డినేటర్ బిహెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో పలువురు కువాయిత్ ప్రవాసులు కలుసుకుని ఈ మేరకు ఒక చెక్కును అంద జేశారు. కువాయిత్‌లోని తెలుగువారు, సాటి తెలుగువారి భాధల్లో పాలుపంచుకునేందుకు ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారని ఇలియాస్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రవాసుల వితరణకు జగన్ అభినందించారు. జగన్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే షేక్ బేపారి అంజాద్బాష, మేయర్ కె.సురేష్‌బాబు, కువాయిత్ ప్రవాసులు జి.ఎస్.బాబురాయుడు, ఎస్.గయాజ్‌బాష, ఎస్.నాసర్, బాబు పాల్గొన్నారు. దాతలు షేక్ హుస్సేన్, వై.లలితరాజ్, ఎం.వెంకటసుబ్బారెడ్డి (దాసరి సంక్షేమ సంఘం), ఫ్లవర్స్ షాప్ కె.షఫీ, పహాహెల్ ముక్తబ్, వైఎస్సార్సీపీ కువాయిత్ కమిటీ సభ్యులు విరాళాల సేకరణకు సహాయసహాకారాలు అందజేశారని ఇలియాస్ కృతజ్ఞతలు తెలిపారు. -
చంద్రబాబుకు రూ.10 లక్షల చెక్కు అందజేసిన సమంత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం హీరోయిన్ సమంత తన వంతు సాయం అందజేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన కార్యాలయంలో సమంత కలిశారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు సమంత 10 లక్షల రూపాయల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. సీఎం వ్యక్తిగత ప్రవేశమార్గం ద్వారా వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది సమంతను అనుమతించడం విశేషం. పలువురు టాలీవుడ్ నటులు తుపాను బాధితులకు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బాధితులకు బాసటగా తెలుగు చిత్ర పరిశ్రమ
-
బాధితులకు బాసటగా... మేము సైతం
‘‘ఎప్పుడు, ఎక్కడ ప్రకృతి విపత్తు సంభవించినా ప్రజలను ఆదుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ ముందుంటుంది. ఇటీవల హుదుహుద్ తుపాను బీభత్సంతో గ్రీన్ సిటీ లాంటి వైజాగ్ కాస్తా బ్రౌన్ సిటీ అయిపోయింది. వైజాగ్ తుపాను బాధితుల కోసం సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కతాటిపై ‘మేము సైతం’ అంటూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. ఈ నెల 30న ‘మేము సైతం’ పేరుతో తెలుగు చిత్రపరిశ్రమ ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పలు రకాల వినోద కార్యక్రమాల ద్వారా విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనుంది. ఈ వివరాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేశ్, శ్రీకాంత్, మురళీ మోహన్, అల్లు అరవింద్, డి. సురేశ్‌బాబు, కేఎల్ నారాయణ, అశోక్ కుమార్, జీవిత, మద్దినేని రమేశ్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. రెండు రోజుల తారాసందోహం... ‘మేము సైతం’ కార్యక్రమంలో భాగంగా 29వ తేదీ శనివారం రాత్రి హైదరాబాద్‌లో ‘తారలతో విందు’ నిర్వహించనున్నారు. విందులో పాల్గొనదలిచిన ఒక్కో జంట టికెట్ ఖరీదు కింద రూ. లక్ష వంతున విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. అలా మొత్తం 250 జంటలకు అవకాశం ఉంటుంది. ఇక, 30వ తేదీ ఆదివారం ఉదయం నుంచి రాత్రి దాకా అన్నపూర్ణా స్టూడియోలో వినోద కార్యక్రమాలుంటాయి. అదే రోజున తారల క్రికెట్ మ్యాచ్, తంబోలా మొదలైనవి కూడా జరుగుతాయి. ఆదివారం నాటి కార్యక్రమానికి రూ. 500 చెల్లించి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తం లక్ష టికెట్లు అమ్మి, కేవలం 104 మందిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన వారికే ఆ కార్యక్రమంలో ప్రవేశం ఉంటుంది. -
బాధితులకు వైఎస్సార్ సీపీ అండ
జి.మాడుగుల : హుద్‌హుద్ తుపాను బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి భరోసా ఇచ్చారు. మండలంలో తుపానుకు పంటలు నష్టపోయిన, ఇళ్లు దెబ్బతిని నిరాశ్రయులైన బాధితులకు పార్టీ అధిష్ఠానం అందచేసిన బియ్యాన్ని మంగళవారం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నష్టపోయిన వారికి పరిహారం చెల్లింపులో ఎటువంటి అన్యాయం జరిగినా ప్రజల పక్షాన పోరాటానికి పార్టీ సన్నద్ధంగా ఉందని చెప్పారు. దెబ్బతిన్న పంటలు, ఇళ్లకు తగిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం తక్షణం అందించి ఆదుకోవాలని కోరారు. తుపాను ధాటికి దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులకు ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి పనులు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మండలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించిన రెండు టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 20 కిలోల చొప్పున ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఐసరం హనుమంతరావు, పార్టీ నాయకులు మత్స్య కొండబాబు, చిరంజీవి, బాబూరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లు కోల్పోయినవారికి పక్కా ఇళ్లు:వెంకయ్య నాయుడు
విశాఖపట్నం: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈరోజు తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. షీలానగర్‌లో బాధితులను పరామర్శించారు. బాధితులు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఇళ్లు కోల్పోయినవారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ** -
తుపాన్ బాధితులను ఆదుకుంటాం: చంద్రబాబు
హైదరాబాద్: హుదూద్ తుపాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. తుపాన్ తీవ్రత, నష్టం ఎక్కువగా ఉందని అన్నారు. తుపాన్ వల్ల వాటిల్లిన నష్టాల వివరాలను వెల్లడించారు. బుధవారం నాటికి నిత్యావసర సరుకులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. తుపాన్ బాధితులను ఆదుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. కార్పొరేట్ కంపెనీలకు కొన్ని ప్రాంతాలను దత్తతకు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. విశాఖను డైనమిక్ సిటీగా తీర్చుదిద్దుతామని తెలిపారు. రైతుల రుణమాఫీ త్వరలో అమలయ్యేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు. -
తుపాను బాధితులకు అండగా నిలుద్దాం: సాక్షి మీడియా
సహృదయంతో స్పందించండి దాతలకు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ పిలుపు ఆపన్నహస్తం అందించేందుకు విరాళాల సేకరణ సెక్షన్ 80జీ కింద ఆదాయ పన్ను మినహాయింపు బ్యాంకు ఖాతా వివరాలివీ.. ఖాతా పేరు: వైఎస్సార్ ఫౌండేషన్ ఖాతా సంఖ్య: 31868397566 బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0008022 బ్రాంచి: బంజారాహిల్స్, ైెహ దరాబాద్ బ్రాంచి కోడ్: 08022 సాక్షి, హైదరాబాద్: కనీవినీ ఎరుగని రీతిలో హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సానికి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తుపాను రూపంలో ప్రకృతి చూపిన ఆగ్రహానికి గంటల్లో అల్లకల్లోలం జరిగి జనజీవనం అస్తవ్యస్తమైంది. వందలాది గ్రామాలు, వేలాది కుటుంబాలు, లక్షలాది జీవితాలు ఛిద్రమయ్యాయి. సర్వహంగులతో శరవేగంగా ఎదుగుతున్న విశాఖ నగరం ఓ విషాద సాగరమైంది. అనేక మంది నిండు ప్రాణాలతో పాటు వృత్తులు, వ్యాపారాలు, ఇళ్లు, రోడ్లు, చెట్లు, పంటలు.. ఇలా సర్వం కకావికలమైన దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. సాటి మనిషి ఆక్రందన చూసి ప్రతి తెలుగు హృదయం ద్రవిస్తోంది. ఇలాంటి సమయంలోనే చేతనైన చేయూతనిచ్చి సాటి మనిషికి సాంత్వన చేకూర్చాలి. ఆపన్న హస్తంతో ఆదుకోవాలి. సహృదయంతో స్పందించాలి. అలా స్పందించే గుణం ప్రతి తెలుగువాడి సొంతం. గతంలోనూ విపత్తులు చోటుచేసుకున్నప్పుడు, బాధితులకు-వితరణశీలురకు మధ్య అంటే అవసరాలకు-వనరులకు మధ్య సంధానకర్తగా ఉండి ‘వైఎస్సార్ ఫౌండేషన్’ సామాజిక బాధ్యతను నిర్వర్తించింది. బాధితులకు అవసరమైన సేవలందించింది. ఎప్పటిలాగే వైఎస్సార్ ఫౌండేషన్ ఈ విపత్తులోనూ బాధితుల సహాయార్థం చొరవతో ముందుకు వచ్చింది. కష్టాల్లో ఉన్న పౌరుల్ని ఆదుకునే కృషిలో ఎప్పుడూ ముందుండే ‘సాక్షి మీడియా గ్రూప్’తో కలిసి ఈ సేవా కార్యక్రమానికి పూనుకుంది. లోగడ కూడా ఇటువంటి ప్రాకృతిక విపత్తులు సంభవించినపుడు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ కలిసి ఉమ్మడిగా సహాయ, సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. ఇప్పు డు హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సానుభూతి, సహృదయంతో ముందుకొచ్చే దాతలందరి నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నాయి. సహృదయులంతా విరాళాలు పంపి సాటి వారిని ఆదుకోవాల్సిందిగా వైఎస్సార్ ఫౌండేషన్ - సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్లు, కంపెనీలు ఉదారభావంతో ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి. ఈ విరాళాలకు ఆదాయ పన్ను చట్టంలోని 80(జీ) సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సహాయం చేయదలచుకున్నవారు పక్క తెలిపిన బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు (అకౌంట్ ట్రాన్స్ఫర్) పంపొచ్చు. ఇదే ఖాతాలో జమ అయ్యేలా డీడీ, చెక్కు రూపాల్లోనూ పంపొచ్చు. డీడీలు, చెక్కు లను జిల్లాల్లో స్థానికంగా ఉండే ‘సాక్షి’ కార్యాలయాల్లోనూ అందించవచ్చు.