ముంచిన ‘అకాలం’
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: అకాల వర్షం రైతన్నను నట్టేటముం చింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. చేతికొచ్చే దశలో మిర్చి రైతును కన్నీరు పెట్టిస్తోంది. వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలంలో సుమారు రెండువేల ఎకరాల్లో సాగుచేసిన మిర్చి కల్లాల్లో నీటిపాలైంది. దుగ్గొండి మండల పరిధిలోని తిమ్మంపేట, మహ్మదాపురం, మర్రిపల్లి, బొబ్బరోనిపల్లి, వెంకటాపురం గ్రామాల్లో మిర్చితోపాటు మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ధర్మసాగర్ మండల పరిధిలో రైతులు మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగుచేసారు. పంట పూర్తిగా నేలకు ఒరిగి పనికి రాకుండా పోయాయి.
తీవ్రమైన గాలులతో కూడిన వర్షానికి మండల పరిధిలో అనేక చోట్ల చెట్లు విరిపడ్డాయి, రేకుల షెడ్ల కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలపై చె ట్ల కొమ్మలు విరిగి పడడంతో కరెంటు సరఫరా నిలిపివేశారు. సోమవారం సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. నిజామాబాద్‌లో జిల్లాలో మొక్కజొన్న, వరి, సజ్జ, జొన్న, టమాట, నువ్వుపంటలకు నష్టం వాటిల్లింది. కల్లాలలో ఆరబోసిన పసుపుకొమ్ములు తడిసి ముద్దయ్యాయి. భీమ్‌గల్ మండలం బాచన్‌పల్లిలో వడగండ్లు కురియడంతో, 11ఆవులు చనిపోయాయి. ముచ్కూర్‌లో బస్టాండ్ సమీపం లో వందల ఏళ్ల నాటి మర్రి మహావృక్షం కుప్పకూలింది. నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో యాదగిరిగుట్ట దేవస్థానం వారు ఏర్పాటు చేసిన స్వాగతతోరణం వర్షానికి కూలిపోయింది. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రూ. 50లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో భారీగా వడగళ్ల వర్షం కురిసింది. వర్షాలతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, మిరప పంటలు నేలకొరిగాయి.
మామిడి పిందెలు నేలరాలాయి. కాగా నర్సాపూర్ మండలంలో వర్షాలకు రెండు పౌల్ట్రీషెడ్‌లు పూర్తిగా ధంసమవ్వగా సుమారు 500కోళ్లు మృతి చెందాయి. సోమవారం రాత్రి వర్షం సృష్టించిన బీభత్సవానికి నష్టం వేలఎకరాలకు పెరిగిపోయింది. జిల్లాలో పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి ఈ నెల 5న ప్రభుత్వానికి తుది నివేదిక పంపించాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖలను ఆదేశించారు.
సీమలో వడగండ్ల వాన
అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సోమవారం వడగండ్ల వాన కురిసింది. అనంతపురం, బెళుగుప్ప, కూడేరు, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, రాప్తాడు, గార్లదిన్నె తదితర మండలాల్లో రూ.కోట్లు విలువ చేసే పండ్ల తోట లు నేలకూలాయి. నగర శివారులోని నర్సరీకి చెందిన పాలీహౌస్ ధ్వంసం కావడంతో రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. బుక్కరాయసముద్రం మండలంలో చెట్టు విరిగిపడటంతో విశాలాంధ్ర పత్రికా విలేకరి ఉజ్జినప్ప(40) మృతిచెందాడు. ఈదురు గాలులతో పైకప్పులు, హోర్డింగ్‌లు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలవాలగా.. భారీవృక్షాలు కూకటివేళ్లతో కూలిపో యాయి. నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కరెంటు సరఫరా పూర్తిగా నిలిచి అంధకారం అలుముకుంది. చెట్ల తొలగింపు, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణకు కనీసం రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని చెంబకూరు పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, వడగండ్ల వానతో ప్రజలు బెంబేలెత్తారు.