పోటెత్తిన యువత | Huge Youngs Attended To AP Grama Sachivalayam Certificate Verification In Kurnool | Sakshi
Sakshi News home page

పోటెత్తిన యువత

Published Sat, Sep 28 2019 10:18 AM | Last Updated on Sat, Sep 28 2019 10:18 AM

Huge Youngs Attended To AP Grama Sachivalayam Certificate Verification In Kurnool - Sakshi

సచివాలయ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న అధికారులు

సాక్షి కర్నూలు(అర్బన్‌) : సచివాలయ ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులతో జిల్లా పరిషత్‌ ప్రాంగణం కిటకిటలాడింది. దసరా పండుగ ముందే వచ్చిందా అన్నట్టుగా సందడి కన్పించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి శుక్రవారం తొమ్మిది రకాల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల  పరిశీలనకు  భారీగా తరలివచ్చారు. అభ్యర్థులతో పాటు వారికి తోడుగా వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో జెడ్పీ ప్రాంగణం కిక్కిరిసింది. స్థానిక డీపీఆర్‌సీ భవనంలో ఆరు రకాల పోస్టులకు, మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ భవనంలో విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్‌ సర్వేయర్‌ పోస్టులకు, పీఆర్‌ ఎస్‌ఈ కార్యాలయం (విశ్వేశ్వరయ్యభవన్‌)లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కొనసాగింది. ముఖ్యంగా ఏఎన్‌ఎం/ వార్డు హెల్త్‌ సెక్రటరీ గ్రేడ్‌–3 పోస్టులకు ఎంపికైన∙వారి జాబితాను ఈ నెల 26న సాయంత్రం అప్‌లోడ్‌ చేయడంతో వారంతా 27వ తేదీన ఉదయానికే జెడ్పీకి చేరుకున్నారు. ఈ పోస్టులతో పాటు విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, వార్డు అమెనిటీస్‌ సెక్రటరీ, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2, వార్డు వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డీపీఆర్‌సీ భవనంలో వెరిఫికేషన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనివల్ల అభ్యర్థులు అధిక సంఖ్యలో అక్కడికే రావడంతో భవనం కిక్కిరిసింది. 

వెరిఫికేషన్‌ నిదానం కావడంతో.. 
ఏఎన్‌ఎం పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన నిదానం కావడంపై అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఇతర పోస్టులకు సంబంధించి వెరిఫికేషన్‌ పూర్తి చేసిన అధికారులతో వారి సర్టిఫికెట్లను పరిశీలింపజేయాలని జెడ్పీ సీఈఓ డాక్టర్‌ సీహెచ్‌ పుల్లారెడ్డి..  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నరసింహులును కోరగా, ఎంత రాత్రయినా సరే తమ శాఖకు చెందిన వారితోనే వెరిఫికేషన్‌ చేయిస్తామని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే డీఎంఅండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ బయట జరుగుతున్న వివిధ రకాల ప్రచారాలను అభ్యర్థులు నమ్మవద్దని, కాల్‌లెటర్లు అందిన అభ్యర్థులందరి సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేస్తామని అన్నారు. అవసరమైతే 28వ తేదీన ఉదయం 9 గంటల నుంచి వెరిఫికేషన్‌ ప్రారంభిస్తామన్నారు.  

మధ్యాహ్నానికే పూర్తి   
విశ్వేశ్వరయ్యభవన్‌లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ శుక్రవారం మధ్యాహ్నానికే పూర్తి చేశారు. మొత్తం 760  పోస్టులకు గాను 26వ తేదీన 400 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలవగా 322 మంది హాజరయ్యారు. అలాగే శుక్రవారం 360 మందిని పిలవగా.. 337 మంది హాజరయ్యారు. పీఆర్‌ ఎస్‌ఈ సీవీ సుబ్బారెడ్డి స్వయంగా వెరిఫికేషన్‌ జరిగే బోర్డుల వద్దే ఉండి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  

వీడని సస్పెన్స్‌ 
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5, మహిళా పోలీస్, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. జిల్లాలో 473  పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌ –5 పోస్టులు, 1,181 మహిళా పోలీస్, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టుల కోసం భారీగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్, మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదనే ఉద్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలను ఒకటికి రెండు సార్లు సరిచూస్తున్నారు. ఫలితంగా ఈ జాబితా అప్‌లోడ్‌ చేసే విషయంలో జాప్యం కొనసాగుతూనే ఉంది. 28వ తేదీ మధ్యాహ్నానికి ఒక కొలిక్కి వస్తే సాయంత్రానికి జాబితాను అప్‌లోడ్‌ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement