ముస్తాబైన గడివేముల మోడల్ సచివాలయం
సాక్షి, కర్నూలు(అర్బన్) : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ముందుగా ప్రకటించిన విధంగానే జిల్లాలో మొత్తం 881 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. అయితే 2వ తేదీన అన్ని మౌలిక వసతులు, ప్రజలకు అందించాల్సిన విస్తృత సేవలతో ప్రతి మండలంలో మోడల్‌గా ఒక సచివాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మోడల్‌గా ప్రారంభం కానున్న సచివాలయంలో కంప్యూటర్లు, ఇంటర్‌నెట్, ఫర్నిచర్, మీ సేవా తదితర అన్ని వసతులను పూర్తి స్థాయిలో అమరుస్తున్నారు. జిల్లాలోని 53 మండలాల్లో ఒక్కో సచివాలయాన్ని మోడల్‌గా ప్రారంభించేసేందుకు ఇప్పటికే అధికారులు గుర్తించారు. డోన్ నియోజకవర్గ పరిధిలోని బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురంలో రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆలూరులో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్..అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలను ప్రారంభించనున్నారు. అన్ని గ్రామ సచివాలయాలను ప్రారంభించేందుకు వీలుగా మెజారిటీ సచివాలయాలకు ఇప్పటికే పెయింటింగ్స్‌ను దాదాపు పూర్తి చేశారు. అలాగే ఫర్నిచర్, ఇతర వసతులను ఏర్పాటు చేసేందుకు సంబంధిత పంచాయతీ అధికారులు కృషి చేస్తున్నారు.
వేగంగా వార్డు సచివాలయాల ఏర్పాట్లు
కర్నూలు (టౌన్): కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 8 మున్సిపాలిటీల్లో 300 వార్డు సచివాలయాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2 నాటికి కర్నూలు కార్పొరేషన్‌లో కర్నూలు, పాణ్యం, కోడుమూరు అర్బన్ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఒక్కొక్క సచివాలయం చొప్పున ప్రారంభించేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌తో పాటు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న వార్డు సచివాలయాల ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న సీఆర్‌సీ (కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్)లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు 103 ప్రెవేట్ భనవాలను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు.
ప్రభుత్వం సూచించిన మేరకు ఆయా భవనాల్లో కంప్యూటర్లు, స్కానర్లు, బీరువాలు ఏర్పాటు చేస్తున్నారు. బాత్‌రూమ్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్నూలులోని ఏర్పాటు చేయనున్న 132 వార్డు సచివాలయాల్లో మరమ్మతులకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. రివర్స్ టెండర్ విధానం అవలంబించడంతో ఆదాయం మిగిలింది. అన్ని వార్డు సచివాలయాల మరమ్మతులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ప్రతి పనిని అంచనా విలువ కన్నా 10 శాతం తక్కువకు టెండర్లను ఖరారు చేశారు. దీంతో ప్రభుత్వానికి అదాయం మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment