కమీషన్ ‘కిరణాలు’ | Hundreds of thousands of unemployed in state | Sakshi
Sakshi News home page

కమీషన్ ‘కిరణాలు’

Published Mon, Sep 30 2013 4:14 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి చూపుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్భాటంగా అమలులోకి తెచ్చిన రాజీవ్ యువకిరణాలు పథకానికి అవినీతి మకిలి అంటుతోంది.

 నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి చూపుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్భాటంగా అమలులోకి తెచ్చిన రాజీవ్ యువకిరణాలు పథకానికి అవినీతి మకిలి అంటుతోంది.
 
 ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ కరువవడంతో ఈ పథకాన్ని కొందరు అధికారులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల నిర్వాహకుల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నిర్వాహకులు ముడుపులు చెల్లించలేక ట్రైనింగ్ సెంటర్లను మూతేస్తున్నారు. నిరుద్యోగులను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు చూపే లక్ష్యంతో రాజీవ్ యువకిరణాలు పథకం అమలులోకి వచ్చింది. డీఆర్‌డీఏ పర్యవేక్షణలో ప్రైవేటు శిక్షణ కేంద్రాల ద్వారా ఈ పథకం అమలు జరిగింది.
 
 ప్రారంభంలో పలు శిక్షణ కేంద్రాల వారు పోటీపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 36 శిక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 15కి పరిమితమైంది. వాటిలో 5 మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. నిబంధనలతో పాటు డీఆర్‌డీఏలోని కొందరు ఉద్యోగుల ధనదాహం కారణంగా శిక్షణ కేంద్రాల నిర్వాహకులు వాటిని మూసేస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి.
 
 ఉద్యోగం లేని వారిని గుర్తించి వారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో భోజన, వసతి సదుపాయం కల్పిస్తారు. అనంతరం వారికి ఉపాధి అవకాశం చూపాల్సిన బాధ్యత శిక్షణ కేంద్రం నిర్వాహకులదే. ఈ ప్రక్రియ పూర్తిచేసినందుకు శిక్షణ కేంద్రం నిర్వాహకులకు ప్రభుత్వం కొంత మొత్తం చెల్లిస్తుంది. శిక్షణ సమయంలో అభ్యర్థుల హాజరు వివరాలను రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేయాలి. ఈ క్రమంలో ఒక్కో అభ్యర్థికి సంబంధించి రూ.4,500 నుంచి రూ.7 వేలను శిక్షణ కేంద్రానికి ప్రభుత్వం అందజేస్తుంది. భోజన, వసతి సదుపాయాలు కల్పించినందుకు ప్రత్యేకంగా బిల్లు చెల్లిస్తారు.

 శిక్షణ పొందిన వారిలో 70 శాతం మందికి ఉపాధి చూపిన తర్వాతే వాటి నిర్వాహకులకు పూర్తిస్థాయిలో బిల్లుల చెల్లింపు జరుగుతుంది. వీటిని పర్యవేక్షించే బాధ్యతను ఏపీఎంలకు అప్పగించారు. జేడీఎం ఆధ్వర్యంలో ఏపీఎంలు పనిచేస్తున్నారు. శిక్షణ కేంద్రాల పనితీరు, వసతుల కల్పన తదితర విషయాలపై వీరు అధికారులకు నివేదిక సమర్పించాలి. అన్నీ బాగుంటేనే బిల్లులు మంజూరవుతాయి. ఈ నిబంధనలే ఏపీఎంలకు వరంగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్లు ఇచ్చిన శిక్షణ కేంద్రాలకు అనుకూలంగా నివేదికలు ఇస్తూ, మిగిలిన వాటికి సంబంధించి కొర్రీలు పెడుతున్నారని పలు కేంద్రాల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
 
 అరకొరగా గిట్టుబాటవుతున్న నేపథ్యంలో ముడుపులు చెల్లించలేక పలువురు తమ కేంద్రాలను మూతేసినట్టు తెలిసింది. నివేదికల్లోని అంశాల కారణంగా పలువురు లక్షల రూపాయలు నష్టపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఆత్మకూరులోని ఓ శిక్షణ కేంద్రం నిర్వాహకుడు రూ.5 లక్షలు నష్టపోయారని సమాచారం. మిగిలిన కేంద్రాల పనితీరు బాగుందా అంటే..అంతా రికార్డులకే పరిమితమని విమర్శలున్నాయి. నెల్లూరులోని కొన్ని శిక్షణ కేంద్రాల్లో అభ్యర్థులు లేకపోయినా బిల్లుల చెల్లింపు జరుగుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. బయోయోట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసే విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు.
 
 ఇదంతా డీఆర్‌డీఏ అధికారులకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలను అరికట్టాలని వారు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement