ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే జిల్లాలో ఆ పార్టీకి దిక్కెవరు? కిరణ్‌ను నమ్ముకుని ఆ పార్టీలో చేరే దెవరు? జనాకర్షణతో ఓట్లు రాబట్టగలిగే సత్తా లేని ఆయన్ను నమ్ముకుని దిగితే తమ పుట్టి మునుగుతుందనే భయం నాయకుల్లో వ్యక్తమవుతోంది.
నెల్లూరు, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే జిల్లాలో ఆ పార్టీకి దిక్కెవరు? కిరణ్‌ను నమ్ముకుని ఆ పార్టీలో చేరే దెవరు? జనాకర్షణతో ఓట్లు రాబట్టగలిగే సత్తా లేని ఆయన్ను నమ్ముకుని దిగితే తమ పుట్టి మునుగుతుందనే భయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆనం సోదరులు ఆయనతో సఖ్యతగా ఉంటూ పనులు సాధించుకున్నారు.
రాష్ట్ర విభజన అంశం తెర మీదకు వచ్చినప్పటి నుంచి కిరణ్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. జిల్లా రాజకీయ సమీకరణాల్లో ఏర్పడిన మార్పుల నేపథ్యంలో శాసనసభ్యుడు ఆదాల ప్రభాకరరెడ్డి సీఎం కిరణ్‌తో చాలా స్నేహంగా మెలుగుతూ వచ్చారు. చివరి వరకు కూడా ఆయన సీఎం వెంటే నడుస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆదాల టీడీపీలో బెర్త్ ఖరారు చేసుకున్నా కిరణ్‌తో సరే అనిపించుకునే బయటకు రావాలని అనుకున్నారు.
అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సీఎంను నమ్ముకుని సమైక్యాంధ్ర నినాదంతో ఆదాల పోటీకి దిగారు. చివరి నిమిషంలో సీఎం చెయ్యిచ్చి తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదని సూక్తి రత్నావళి వల్లించడంతో ఆదాలకు చిర్రెత్తి పోయింది. ‘నీకు, నీ సమైక్య వాదనకు ఓ నమస్కారం నాయనా’’ అని ఆ రోజు నుంచి సీఎంతో మాట్లాడటం మానేశారు.
బుధవారం కిరణ్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న అనంతరం మంగళవారం ఉదయం నుంచి కిరణ్ సోదరులు ఆదాలకు ఫోన్ చేసి తమతో రావాలని ఒత్తిడి చేశారని తెలిసింది. కుక్క తోకను పట్టుకుని గోదారిని ఈదే సాహసం తాను చేయలేనని ఆదాల అక్కసు వెళ్ల గక్కారని సమాచారం. నెల్లూరు జిల్లా నుంచి ఎవరొచ్చినా, ఎవరు రాక పోయినా ఆదాలను తమ వెంట ఉంచుకోవచ్చని భావించిన కిరణ్‌కు ఈ రకంగా ఎదురు దెబ్బ తగిలింది. ఇక పోతే అల్లూరు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి కూడా కిరణ్ సీఎం అయినప్పటి నుంచి ఆయనతో దగ్గరగా ఉంటూ వచ్చారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఎం తీరుతో కాస్త అటు ఇటుగా వ్యవహరిస్తూ వచ్చిన విష్ణువర్ధన్‌రెడ్డి కిరణ్ కొత్త పార్టీ పెట్టినా అటు వైపు అడుగులు వేసే పరిస్థితి కనిపించడం లేదు. కిరణ్ సీఎం అయ్యాక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పదవి దక్కించుకున్న వాకాటి నారాయణరెడ్డి సైతం ఆయనతో సఖ్యతగా మెలుగుతూ వచ్చారు. సీఎం తన పదవికి రాజీనామా ప్రకటించడానికి రెండు రోజుల ముందు కూడా సూళ్లూరు పేట నియోజక వర్గానికి రూ. 29 కోట్ల పనులు మంజూరు చేయించుకుని వచ్చారు. కిరణ్ పార్టీ పెడితే జిల్లాలో వాకాటే పెద్ద దిక్కుగా వ్యవహరించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే బుధవారం సీఎం రాజీనామా ప్రకటించే సమయంలో వాకాటి అటువైపు వెళ్లలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్ పార్టీ పెట్టినా పెద్ద ప్రభావం చూపే అవకాశం లేదని, తనకు ఇంకా మూడేళ్ల పదవీ కాలం ఉన్నందువల్ల ఎటూ వెళ్లకుండా వేచి చూద్దామనే నిర్ణయానికి వచ్చినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వెంకటగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి కూడా కిరణ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపించడం లేదు. మిగిలిన నేతలు కూడా వేచి చేసే ధోరణిలో ఉన్నారు. కిరణ్ కొత్త పార్టీ పెట్టినా జిల్లాలో గుర్తింపు పొందిన నాయకులెవరూ ఆయనతో వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఒక వేళ పార్టీ పెట్టినా ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలో టికెట్లు దొరకని వారు మాత్రమే అటుగా వెళ్లే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఎవరొస్తారు? : సీఎం పదవికి రాజీనామా చేయడానికి నాలుగైదు రోజుల ముందే కిరణ్‌కుమార్‌రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి తన వెంట ఎవరొస్తారనే విషయంపై రహస్యంగా సమాచారం తెప్పించుకున్నట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా జిల్లాలో ఏ పార్టీ నాయకుడు ఎటు వైపు వెళ్లే ఆలోచనలో ఉన్నారు? కాంగ్రెస్‌ను వీడి కిరణ్ వెంట ఎవరొస్తారు? అనే వివరాలు సేకరించినట్టు తెలిసింది.