తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్న సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డిని తనవైపు నిలుపుకునేలా చూస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో బౌలింగ్ వేశారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్న సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డిని తనవైపు నిలుపుకునేలా చూస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో బౌలింగ్ వేశారు. వస్తే రాజ్యసభ పదవి లేదా, పోతే కొన్ని కోట్లు అనే రీతిలో ఆదాలను క్రీజ్‌లోకి దించారు. అధిష్టానం అభ్యర్థిగా బరిలోకి దూకిన నెల్లూరుకు చెందిన టి.సుబ్బిరామిరెడ్డికి ఇదే జిల్లాకు చెందిన తన బంధువు ఆదాల ద్వారా చెక్‌పెట్టే యోచనతోనే కిరణ్ ఈ బంతి విసిరినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అల్లూరు నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల తొలి ప్రయత్నం లోనే గెలిచి మంత్రి కూడా అయ్యారు.
ఆ తర్వాత 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ పరాజయం చవిచూసింది. మంత్రిగా ఆదాల పార్టీని ముందుకు నడిపించలేక పోయారనే భావనతో చంద్రబాబు ఆయన్ను తొలగించి ఆ స్థానంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఈ పరిణామంతో అప్పట్లో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, పరసారత్నం, బల్లి దుర్గాప్రసాద్‌లు ఆదాల సహకారంతో సోమిరెడ్డి వ్యతిరేక కూటమి నడిపారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నా కూడా ఆయన్ను తన నియోజకవర్గానికే పరిమితం చేయగలిగారు.
ఈ సమీకరణల కారణంగా రగిలిన అంతర్గత పోరు చివరకు ఆదాల, సోమిరెడ్డి మధ్య రాజకీయ వైరం రగిలించింది. దీంతో సోమిరెడ్డిని ఓడించి కసి తీర్చుకోవాలని ఆదాల 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి సర్వేపల్లి నుంచి పోటికి దిగి సోమిరెడ్డిని ఓడించిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా 2009లోనూ సోమిరెడ్డిని రెండోసారి ఓడించారు. ఆదాల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ జిల్లా సమీకరణల్లో ఆనం బ్రదర్స్‌తో టచ్‌మీ నాట్ రాజకీయమే నడుపుతూ వచ్చారు. 2009లో ఆనం వల్లే తనకు మంత్రి పదవి దక్కలేదనే అక్కసు కూడా ఆయన్ను వారికి మరింత దూరం చేసింది.
సీఎం సన్నిహితుడిగా..
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆదాల బంధువు. ఈ కారణంగానే కిరణ్ సీఎం అయినప్పటి నుంచి ఆయనతో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తాను టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ కిరణ్ నుంచి ఓకే అనిపించుకునే వెళ్లాలనే విధంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే కొత్త పార్టీ అంశం తెర మీదకు రావడంతో జిల్లాలో ఈ పార్టీ బాధ్యతలు ఆదాలకే అప్పగించాలని సీఎం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఆయన్ను బయటకు వెళ్లకుండా ఇంతకాలం పట్టుకొచ్చారని తెలిసింది. ఆనం బ్రదర్స్ ఎలాగూ కాంగ్రెస్‌లోనే కొనసాగే అవకాశం ఉన్నందువల్ల ఆర్థికంగా బలమైన ఆదాలనే తన ప్రతినిధి చేసుకోవాలనే కోణంలోనే సీఎం ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కిరణ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
రెండు రోజుల ముందే
‘ఈ నెల 30వ తేదీ వరకు ఆగండి. ఆ లోగా ఏమైనా జరగొచ్చు. అంతా కలసి నిర్ణయం తీసుకుందాం’ అని ఇటీవలే ఆదాల, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డికి చెప్పిన సీఎం రెండు రోజుల ముందే తన మాటల్లోని మర్మమేమిటో తెలియజేశారు. సమైక్య ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన రాజ్యసభ అభ్యర్థులకు రెబల్‌గా పార్టీ తరపున ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తొలి నుంచి ఊహిం చినట్లుగా జేసీ దివాకర్‌రెడ్డికి బదులు మంగళవారం అనూహ్యంగా ఆదాల రాజ్యసభ ఎన్నికల యుద్ధంలోకి దూకారు.
సీఎం స్కెచ్ మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. అవసరం లేనిదే రూపాయి ఖర్చు పెట్టరనే పేరున్న ఆదాల సీఎంతో అన్నీ మాట్లాడుకునే బరిలోకి దూకారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధిష్టానం అభ్యర్థిగా పోటీకి దిగిన నెల్లూరు వ్యక్తి టి.సుబ్బిరామిరెడ్డికి ఇదే ప్రాంతానికి చెందిన ఆదాలతో చెక్‌పెట్టేందుకే సీఎం ఈ తెర వెనక రాజకీయ నాటకం ఆడించినట్లు ప్రచారంలో ఉంది.
ఆదాల అన్ని పార్టీల వారితో మంచి సంబంధాలు నడుపుతున్నందువల్ల కాంగ్రెస్ నుంచే కాక టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యేల ఓట్లు సంపాదించగలరనే నమ్మకంతోనే సీఎం ఆయన్ను బరిలోకి దించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పైగా ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో మెజారిటీ మద్దతు కూడా తమకు లభిస్తుందనీ, మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ మేరకు లాబీయింగ్ చేస్తున్నారని ఆదాల మద్దతుదారులు చెబుతున్నారు. పదవి ఎక్కడుంటే అక్కడుంటారనే పేరు సంపాదించిన ఆదాల అన్నీ ఆలోచించే బరిలోకి దూకి ఉంటారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.