ఆడపిల్లను కనిందని కట్టుకున్న భార్యను గెంటేసిన భర్త ఉదంతమది. మండలంలోని గాదెగూడూరు గ్రామానికి చెందిన మహేంద్రారెడ్డి భార్య శివలక్ష్మిని గెంటేశాడు.
రాజుపాళెం, న్యూస్‌లైన్: ఆడపిల్లను కనిందని కట్టుకున్న భార్యను గెంటేసిన భర్త ఉదంతమది. మండలంలోని గాదెగూడూరు గ్రామానికి చెందిన మహేంద్రారెడ్డి భార్య శివలక్ష్మిని గెంటేశాడు. మూడునెలల క్రితం శివలక్ష్మి ఆడపిల్లకు జన్మనిచ్చింది. గర్భవతిగా ఉన్న సమయంలో స్కానింగ్ చేయించగా ఆడపిల్ల అని తెలియడంతో భర్త, అత్త, మామల నుంచి శివలక్ష్మికి వేధింపులు మొదలయ్యాయి. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన శివలక్ష్మికి 2009 నవంబరు 23వ తేదీన రాజుపాళెం గాదెగూడూరు గ్రామానికి చెందిన గొంగటి మహేంద్రారెడ్డితో వివాహమైంది. అప్పట్లో వరకట్నం కింద రూ.2.50 లక్షలు డబ్బు ఇచ్చారు. దాంతో బంగారు నగలను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి సజావుగా సాగిన సంసారంలో రెండేళ్ల నుంచి చిన్నపాటి సమస్యలు ఎదురయ్యాయి.
ఈ నేపథ్యంలో శివలక్ష్మి గర్భవతి అయింది. అడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని కోరారు. పెళ్లయిన చాలా ఏళ్లకు గర్భం వస్తే అబార్షన్ చేయించుకోమంటారా అంటూ శివలక్ష్మి పుట్టింటికి వెళ్లింది. మూడు నెలల అనంతరం తిరిగి కాపురానికి రావడంతో శివలక్ష్మిని ఇంట్లోకి రానీయకుండా చేశారు. మూడు రోజులుగా శివలక్ష్మి ఇంటి ఆరుబయటే పడిగాపులు కాస్తోంది. సంఘటనపై రాజుపాళెం ఎస్‌ఐ సుబ్బారావు విచారణ చేపట్టారు. భర్త, మామలతో మాట్లాడారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. దీంతో పాపతో పాటు శివలక్ష్మిని ఇంట్లోకి తీసుకెళ్లారు.