పట్టుదల, ఏకాగ్రతతో జాతీయస్థాయిలో క్రీడల్లో రాణించి తర్లుపాడు మండలం నాయుడుపల్లె గ్రామానికి వన్నె తెచ్చాడో ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి. ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినా రగ్బీ ఆటపై అతనికున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆటకు తమ సహాయ సహకారాలు అందించి జాతీయస్థాయిలో రాణించే విధంగా తోడ్పడ్డారు. సాధనతో ఏదైనా సాధించవచ్చని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు గాలి మహేంద్రరెడ్డి.
తర్లుపాడు: జిల్లాలోని తర్లుపాడు మండలం నాయుడుపల్లె గ్రామానికి చెందిన గాలి వెంకట రంగారెడ్డి, జి.వి.శివ దంపతుల కుమారుడు మహేంద్రరెడ్డి. పాఠశాల స్థాయిలో రగ్బీ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. పోటీల్లో రాణిస్తూ పలు బహుమతులు సాధించాడు. రగ్బీపై మహేంద్రరెడ్డికి ఉన్న ఆసక్తి, రాణిస్తున్న తీరును గమనించి ఫారిన్ కోచ్‌లు పలు సూచనలు చేస్తూ కర్నూలులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
పంజాబ్‌లోని లూథియానాలో జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్ పోటీలు గతనెల 30 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు నిర్వహించారు. ఆ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందానికి మహేంద్రరెడ్డి కెప్టెన్‌గా సెమీ ఫైనల్ ఆడటం మండలం, జిల్లా, రాష్ట్రానికే వన్నె తెచ్చింది. రగ్బీ క్రీడ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.జి.భరత్, సెక్రటరీ బి.రామాంజనేయులు, సీనియర్ క్రీడాకారుల ప్రొత్సాహంతో పలు విభాగాల్లో రాణించి ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు.
రెండేళ్ల క్రిందట జిల్లా స్థాయి పోటీల్లో రాణించాడు. ఆ తరువాత 2017 సెప్టెంబర్‌లో సౌత్ జోన్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రగ్బీ క్రీడాకారులు పాల్గొన్నారు. సౌత్ జోన్ పోటీల్లో మహేంద్రరెడ్డి రాణించటంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
ప్రభుత్వం చేయూతనివ్వాలి:
జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం చేయూతనిచ్చి ప్రొత్సహించాల్సి ఉంది. ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మండల, పట్టణ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి శిక్షకులను నియమించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న పేద క్రీడాకారులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఉపకార వేతనం అందించాలని పలువురు క్రీడాభిమానులు కోరుతున్నారు.
ప్రతిభ ఉన్నా ఆర్థికస్థోమత లేని క్రీడాకారులు ఎందరో మరుగున పడుతున్నారని వారిని గుర్తించి ప్రోత్సహించాలంటున్నారు. రగ్బీ క్రీడలో ఆల్ ఇండియా డివిజన్ 2లో 15ఎస్ ఛాంపియన్‌షిప్ ఆడిన గాలి మహేంద్రరెడ్డి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా పశ్చిమ ప్రకాశానికి వన్నె తెచ్చాడని సాధన డిగ్రీ కళాశాల డైరెక్టర్ జి.ఎల్.రమేష్‌బాబు విద్యార్థిని అభినందించారు. కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న మహేంద్రరెడ్డి జాతీయ క్రీడల్లో రాణించటం కళాశాలకే గర్వకారణంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment