భార్యాభర్తలను బలిగొన్న లారీ
Published Mon, Sep 30 2013 1:32 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : కాళ్ల పారాణి పూర్తిగా ఆరక ముందే ఆ నవ జంటను ఓ లారీ బలిగొంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన చేబోలు రాజేంద్ర కుమార్ (34)కు పెంటపాడు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సునీత (22)తో నెల రోజుల క్రితం వివాహమయ్యింది. పుట్టింటి వద్ద ఉన్న సునీతను చూసేందుకు రాజేంద్రకుమార్ ఆదివారం ఉదయం తన స్నేహితుడు చొక్కాపుల త్రిమూర్తులు, అతని భార్య దుర్గాభవాని, వారి కుమార్తె ైచైత్రిక, కుమారుడు నిహార్‌లతో కలిసి యండగండి నుంచి రెండు బైక్‌లపై చింతపల్లి వచ్చారు.
కొద్దిసేపు అక్కడ ఉన్న తర్వాత తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోని శివాలయానికి బయలుదేరారు. రాజేంద్రకుమార్ తన భార్య సునీతను, మిత్రుడి కుమార్తె చైత్రికను బైక్‌పై ఎక్కించుకోగా త్రిమూర్తులు భార్యా, కుమారుడితో బయలుదేరారు. ఉదయం 9.30 గంటల సమయంలో గూడెం ఓవర్ బ్రిడ్జిపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఎరువుల లోడ్ లారీ రాజేంద్రకుమార్ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మోటార్ సైకిల్ లారీ కిందకు వెళ్లిపోయింది. రాజేంద్ర కుమార్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య సునీత, మిత్రుడు కుమార్తె చైత్రికలకు తీవ్రగాయాలయ్యాయి. సునీతకు కుడి కాలు నుజ్జయ్యింది. ఛైత్రికకు తలపైన గాయం కావడంతో పాటు ఎడమ చెయ్యి విరిగిపోయింది. వీరిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో సునీత మృతి చెందింది. చైత్రిక విజయవాడలో చికిత్స పొందుతోంది. రాజేంద్రకుమార్, సునీత మృతదేహాలకు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. హెచ్‌సీ ముత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement