బూర్జ: వారికి వివాహం జరిగి పదేళ్లయింది. సంతానం కోసం ఎన్నో ఆలయాలు తిరిగారు. ఎందరో దేవుళ్లకు మొక్కారు. వాళ్ల పూజలు ఫలించాయి. భార్య గర్భవతి అని తెలియగానే భర్త సంబరపడిపోయారు. ఏడు నెలలు గిర్రున తిరిగాయి. సీమంతం వేడుక శుక్రవారం ఎంతో ఘనంగా నిర్వహించారు. బంధువులు, స్నేహితులతో ఆ ఇల్లు సందడి నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే ముద్దులొలికే చిన్నారిని ఎత్తుకుంటానని ఎన్నో కలలు కన్నారు. ఇంతలోనే ఆ కుటుంబంలోనే అంతులేని విషాదం చోటుచేసుకుంది. బిడ్డను చూడకుండానే ఆ తండ్రి విద్యుత్ షాక్‌తో మరణించిన హృదయవిదారక సంఘటన మండలంలోని కేకేరాజపురంలో శనివారం జరిగింది.
నాలుగు రోజుల క్రితమే స్వగ్రామానికి
గ్రామానికి చెందిన వేపారి లోకేశ్వరరావు(46) ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రసుత్తం వీరు విశాఖపట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు పదేళ్ల క్రితం జ్ఞాన ప్రసూన(పద్మ)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు కలగకపోవడంతో నిరుత్సాహపడ్డారు. చివరకు పద్మ గర్భవతి అని తెలియడంతో వారి కుటుంబంలో కొత్త ఆశలు చిగురించాయి. స్వగ్రామంలో భార్యకు సీమంతం చేయాలని నాలుగు రోజుల క్రితం భార్యను తీసుకుని లోకేశ్వరరావు కేకే రాజపురానికి వచ్చారు. బంధువులు, మిత్రులు అందరినీ పిలిచి సంప్రదాయబద్ధంగా, ఎంతో ఘనంగా శుక్రవారం సీమంతం నిర్వహించారు. వచ్చిన వారంతా భార్యాభర్తలను చూసి ఎంతో సంతోషించారు. బంధువులంతా ఇంకా ఇంట్లోనే ఉన్నారు. ఆ ఆనందం ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఇంతలోనే లోకేశ్వరరావు విద్యుత్‌షాక్‌తో శనివారం మృత్యువాతపడ్డారు.
ఆస్పత్రికి తరలించేలోగానే..
బంధువులు వస్తారని మూడు రోజులు కిందటే ఇంట్లో కొత్తగా మోటార్ వేయించారు. శనివారం మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నించినా ఆన్ కాలేదు. అందులో నీరు పోయగానే వెంటనే విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో మోటార్‌కే అతుక్కుపోయారు. పక్కనే ఉన్న తల్లి రాజేశ్వరమ్మ కర్రతో కొట్టడంతో కిందకు పడిపోయారు. హుటాహుటిన లోకేష్‌ను ఆటోలో పాలకొండ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. లోకేశ్వరరావు మృతిచెందాడని తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వార్త విన్న పద్మ విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.
మరో రెండు నెలల్లో చిన్నారిని చూసుకుని మురిసిపోవాలని లోకేష్ ఎంతో సంబరపడ్డాడని, కానీ బిడ్డను చూడకుండానే ఇలా విగతజీవిగా మారడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కగానొన్క కొడుకు తన చేతుల్లోనే మరణించడాన్ని తట్టుకోలేక ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గ్రామానికి వచ్చి నాలుగు రోజులు మిత్రులను కలిసి ఆనందాన్ని పంచుకున్నాడని, ఆ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదని విషణ్ణ వదనాలతో రోదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment