సోంపేట: గౌరీ పౌర్ణమి పండగ పూట ఆ కుటుంబాన్ని విధి వక్రీకరించింది. విద్యుత్ షాక్ రూపంలో కుటుంబ పెద్ద దిక్కును దూరం చేసింది. మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు దుర్మరణం చెందిన ఘటన గురువారం సోంపేట మండలం రుషికుడ్డలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.రుషికుడ్డకు చెందిన యువ రైతు దున్న పర్సయ్య చిన్న కుమారుడు పాపారావు (35) తనకున్న రెండు ఎకరాల పొలంలో పంటలు సాగు చేస్తూ, గ్రామంలో విద్యుత్ పనులు నిర్వహిస్తూ జీవనాధారం పొందుతున్నాడు. గ్రామంలో ఎత్తిపోతల పథకం నిర్వహణలో భాగంగా గురువారం ఉదయం ప్యానల్ బోర్డు వద్ద మోటార్లు ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీనిని గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాపారావును ఆటోలో సోంపేట సామాజిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పాపారావుకు భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు హర్షిని(5), నిరీక్ష(3) ఉన్నారు. ఈ ఘటనపై సోంపేట హెడ్ కానిస్టేబుల్ మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి సోంపేట సామాజిక ఆసుపత్రిలో శవపంచనామా నిర్వహించారు.
పలువురి పరామర్శ..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న పాపారావు కుటుంబ సభ్యులు పలువురు నాయకులు పరామర్శించి ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే పిరి యా సాయిరాజ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎన్.దాస్, జెడ్పీటీసీ ఎస్. చంద్రమోహన్, రుషికుడ్డ సర్పంచ్ కె.కామేశ్వరరావు, తడక జోగారావు తదితరులు పరామర్శించా రు.
గ్రామంలో విషాదఛాయలు
పాపారావు భార్యాబిడ్డలతో కలిసి తన అన్నయ్య కుటుంబంతోనే ఉమ్మడిగా కలిసి ఉంటున్నారు. గ్రామంలో విద్యుత్ సమస్యలు తీర్చడంతో పాటు వివాహాది శుభకార్యాలకు తక్కువ ధరలకు ఎలక్ట్రికల్ సదుపాయం కల్పించే వాడని, చాలామంది యువకులకు విద్యుత్ పనుల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. పాపారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment