న్యాయం కోసం మహిళ మౌనపోరాటం
రామచంద్రపురం : అదనపు కట్నం కావాలని డిమాండ్ చేస్తూ తనను కాపురానికి తీసుకువెళ్లడం లేదని, తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ ఆదివారం స్థానిక కేఎస్‌ఆర్ నగర్‌లో అత్తవారి ఇంటి వద్ద మౌనపోరాటం చేపట్టింది. బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన దంగేటి నారాయణరావు కుమారుడు రవికుమార్‌తో 2012లో తునికి చెందిన శేషవల్లికి వివాహమైంది. పెళ్లి సమయంలో శేషవల్లి తల్లిదండ్రులు కట్నంగా రూ.1.5 లక్షలు ఇచ్చారు. అదనంగా రూ.20 లక్షలు కట్నంగా తీసుకురావాలంటూ శేషవల్లిని అత్తింటి వారు పుట్టింటికి పంపించేశారు. ఒకటిన్నరేళ్లుగా కాపురానికి తీసుకువెళ్లకుండా ఆమెను వేధిస్తున్నారు. దీంతో ఆమె అత్తవారింటి వద్ద మౌనపోరాటం చేపట్టింది. రామచంద్రపురం ఎస్సై ఫజల్ రహ్మాన్ అక్కడకు చేరుకుని శేషవల్లి, ఆమె భర్త రవికుమార్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎస్సై హామీ ఇవ్వడంతో శేషవల్లి తన ఆందోళన విరమించింది.