సాక్షి, గోపాలపురం: ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తేవాలని వేధిస్తూ కోడలిని ఇంటి నుంచి గెంటివేసిన సంఘటన గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో వెలుగు చూసింది. బాధితురాలైన ఆ ఇల్లాలికి మద్దతుగా గురువారం వెదుళ్లకుంటలో మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన యాగంటి శివరామకృష్ణ, కనకదుర్గల కుమార్తె శ్రీదేవిని గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు మోహనకృష్ణకు ఇచ్చి 2015 మేలో వివాహం చేశారు. శ్రీదేవి తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించడంతో తల్లి కనకదుర్గే పెంచింది. అప్పట్లో కట్నం కింద రూ 15 లక్షలు, 70 కాసులు బంగారం ఇచ్చారు.
పెళ్లి అయిన తరువాత కొంతకాలం బెంగళూరులో కాపురం పెట్టారు. ఆ తరువాత వారికి ఓ పాప పుట్టింది. కాని 70 కాసుల బంగారం హారతి కర్పూరంలా ఖర్చు చేశాడు. పెళ్లికి ముందు మోహన్‌కృష్ణ బెంగళూరులో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని, అతని పేరుమీద 23 ఎకరాల పొలం ఉందని అతని తల్లిదండ్రులు చెప్పారని, కాని విచారిస్తే ఏ ఉద్యోగం లేదని తేలిందని శ్రీదేవి వాపోయింది. తీసుకెళ్లిన నగదు, నగలు అయిపోవడంతో శ్రీదేవి పేరుమీద ఉన్న ఎకరం పొలం అమ్ముకుని రావాలంటూ భర్త, అత్తమామలు, ఆడపడుచు, మరిది వేధిస్తున్నారని తెలిపింది. దీనిపై ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మహిళా సంఘాలను ఆశ్రయించినట్లు తెలిపింది. కోడలు శ్రీదేవి మనుమరాలితో గోపాలపురం వచ్చిందని తెలుసుకున్న శ్రీదేవి అత్తమామలు ఇంటి నుంచి పరారైనట్లు తెలిపింది.
దీంతో ఏమి చేయాలో తెలియక వెదుళ్లకుంట అత్తారింటికి వెళ్లే దారిలో ధర్నా చేపట్టింది. జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి బి.నిర్మలా కిషోర్, ఆలపాటి దుర్గాభవాని, డి. భీష్మాంబ, వై జగదాంబ, ఆర్ సంధ్య, సీహెచ్ లక్ష్మి, పి.సూర్యాకాంతం తదితరులు శ్రీదేవికి మద్దతు పలికారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ ధర్నా విరమించేదిలేదని మహిళా సంఘాల సభ్యులు పేర్కొన్నారు. చీకటి పడటంతో బాధితురాలికి మహిళా సంఘ నేతలు వారి ఇంటిలో ఆశ్రయం కల్పించారు. ఈ విషయమై స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణను అడగగా ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.
మోహనకృష్ణ, శ్రీదేవి పెళ్లి ఫోటో (ఫైల్)
న్యాయం కోసం ధర్నా చేస్తున్న బాధితురాలు శ్రీదేవి
Comments
Please login to add a commentAdd a comment