మహిళ ఆత్మహత్య
హైదరాబాద్, ఉప్పల్: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, మోత్కూరు మండలం, పాటిమట్ల గ్రామానికి చెందిన భోరెడ్డి రాజశేఖర్ రెడ్డికి గుండాల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన మలిపెద్ది రవళి(25)తో 2019లో వివాహం జరిగింది. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చిన వారు ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.
వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా రవళిని అత్తమామలు, ఆడబిడ్డలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. పలు మార్లు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని నచ్చజెప్పినా వారి వైఖరి మారలేదు. ఏడాది క్రితం రాజశేఖర్ రెడ్డి భార్యను వదిలేసి స్వగ్రామానికి వెళ్లి పోయాడు. అప్పటి నుంచి రవళి ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి లోనైన ఆమె శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. వరకట్న వేధింపుల కారణంగానే తన కుమార్తె అత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి రజిత ఉప్పల్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా పిల్లలిద్దరూ తండ్రి వద్దనే ఉంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment