హైదరాబాద్, సాక్షి: నిత్యం తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందంటూ కొందరు చిన్నారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్లు లేఖ రాశారు. దీంతో లేఖను సుమోటోగా తీసుకుని.. ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణ చేపట్టింది హైకోర్టు.
హైకోర్టుకు చిన్నారుల లేఖ
ఆదిలాబాద్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో కొంత భాగాన్ని కబ్జా చేసే యత్నం చేస్తున్నారంటూ 23 మంది చిన్నారులు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. రోజూ తాము ఆడుకునే పార్క్‌ను ఎలాగైనా కాపాడాలంటూ లేఖలో సీజేను కోరారు. దీంతో.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని సీఎస్, జిల్లా కలెక్టర్, పురపాలక సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిల్‌పై తదుపరి విచారణ మార్చి 7కు వాయిదా వేసింది.
స్థలం సంగతేంటీ?
అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పిల్లలు అడుకునేందుకు 1.5 ఎకరాల పార్క్ స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించి పార్క్ నిర్మాణం చేపట్టింది. ఈ స్థలం కబ్జా చేస్తున్నారని 2022 సంవత్సరం ఫిబ్రవరిలో కౌన్సిలర్ అంబకంటి అశోక్ అప్పటి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో కౌన్సిలర్ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించాడు. దీంతో అప్పట్లో నిర్మాణం ఆగిపోయింది. దాని తర్వాత కూడా అధికారులు పార్కు అభివృద్ధి విషయంలో చర్యలు చేపట్టలేదు. దీంతో కొందరు మళ్ళీ ఆ స్థలంలో నిర్మాణం మొదలుపెట్టారు. దీనిపై తిరిగి కౌన్సిలర్, కాలనీవాసులతో కలిసి కమిషనర్ తో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు.
పెద్దల వల్ల కానిది పిల్లలు.!
ఇదే కాలనీకి చెందిన 23 మంది పిల్లలు.. పార్కును కాపాడాలంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు 2023లో లెటర్ రాశారు. ఈ లేఖను అందుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పందించడమే కాకుండా.. మరిన్ని వివరాలు కావాలంటూ యంత్రాంగాన్ని అడిగారు. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందని, ఈ భూమిని కాపాడి పార్కును నిర్మించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కి రాసిన లేఖలో చిన్నారులో కోరారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అప్పటి కమిషనర్ శైలజ పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. తాము ఆడుకునే పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు.. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ జిల్లా ,కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆక్రమణల కట్టడికి తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించారు. తదుపరి విచారణ మార్చి 7 కు తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment