సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యపై తెలంగాణ హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా మందలించింది. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసేందుకు యత్నించారంటూ మండిపడింది చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.
సోమవారం పిటిషనర్ హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది వాదనలకు సిద్ధం కాగా.. ఆ వెంటనే బెంచ్ కలుగజేసుకుంది. ‘‘ఇదో పబ్లిక్ న్యూసెన్స్. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందసలు?. వ్యక్తిగత కక్షతోనే పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ మాజీ ఎంపీ అయ్యి ఉండి మీరు ఇలా వ్యవహరించడం ఆమోద యోగ్యం కాద’’ని తెలిపింది.
‘‘సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేలా చూడాలని పిటిషన్ వేశారు. రాష్ట్రపతి లేఖ రాశాం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం.. అని అంటారా!. ఇది ఏం పద్ధతి?. ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడి పనిచేయవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు.
మీరు దాఖలు చేసిన పిటిషన్‌లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉంది అని మీకైనా అనిపిస్తోందా?. వ్యక్తిగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి.. మా విలువైన సమయాన్ని వృధా చేయొద్దు. ఈ మధ్య తెలంగాణ గవర్నర్ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ కేసులు ఎక్కువయ్యాయి. కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారింది. మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేం అని బెంచ్ పిటిషనర్‌కు స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. సీఎం జగన్‌పై కేసుల్ని త్వరగతిన విచారణ పూర్తి చేయాలని, 2024 సాధారణ ఎన్నికలకు ముందే తీర్పు వెలువరించాలని, ఆ మేరకు సీబీఐకోర్టుకు ఆదేశించాలని జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఈ పిల్ పైఅభ్యంతరం లేవనెత్తిన రిజిస్ట్రీ.. కేసు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఫైలింగ్ నంబర్‌పైనే విచారణ మొదలైంది. రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తిన అంశాల కాపీని పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను జూలై 6కు వాయిదా వేసింది ధర్మాసనం.
ఇదీ చదవండి: కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం జగన్ బాసట
Comments
Please login to add a commentAdd a comment