
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధానికి చేపట్టిన చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను అడ్డంపెట్టుకుని వ్యాపారులు కూరగాయల రేట్లను విపరీతంగా పెంచేయడంపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి, ఆహార, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు తదితరులను ప్రతివాదులుగా చేర్చింది.
ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. ఫలక్‌నూమా రైతుబజార్, మండీ, మెహదీపట్నం రైతు బజారల్లో విపరీతంగా కూరగాయల రేట్లను పెంచేశారంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. బెండకాయలను కిలో రూ.44కి అమ్మాలని బోర్డుపై ఉండగా, రూ.70కి అమ్ముతున్నారని ఆ కథనాల్లో పేర్కొన్నారు. పలు కూరగాయలను భారీ రేట్లకు విక్రయిస్తున్నారని అందులో వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూరగాయల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.