ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది | husband killed wife and Boyfriend | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

Published Wed, Jul 2 2014 2:26 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

husband  killed wife and Boyfriend

 ఇరగవరం : మండలంలోని రేలంగిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే అతనిని హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రేలంగి గ్రామానికి చెందిన పసుపులేటి కృష్ణ(30) ఈ ఏడాది జనవరి 8వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా మృతుని తండ్రి బలరామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పెనుగొండ సీఐ వానపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.
 
 పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసును ఛేదించారు. మృతుడు కృష్ణకు పదేళ్ల క్రితం దేవరపల్లి మండలం బంధపురం గ్రామానికి చెందిన సత్యవతితో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. తొలుత భార్య సత్యవతికి స్వగ్రామం బంధపురంలో పీఎంపీ వైద్యుడితో పరిచయం ఏర్పడి అతనితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆమె కుటుంబ సభ్యులు పీఎంపీ వైద్యుడిని పిలిపించి విచారించగా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
 
 తిరిగి సత్యవతి రేలంగి గ్రామంలో దాసిరెడ్డి ఆంజనేయ రాజు(పుల్లయ్య)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భార్య ప్రవర్తనతో కృష్ణ మద్యానికి బానిసై వారి సంతోషానికి అడ్డుతగులుతున్నాడు. భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన సత్యవతి, ఆంజనేయ రాజుతో కలిసి హత్యకు పథకం రూపొందించింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భర్త నిద్రిస్తుండగా ప్రియుడి సహాయంతో మెడకు తువాలు బిగించి హతమార్చారు. పోలీసుల విచారణలో నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. వారిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. కేసు దర్యాప్తునకు హెచ్‌సీ ఆర్.కొండలరావు, ఎస్.ప్రదీప్ కుమార్ సహకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement